తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి హార్వర్డ్ కెన్నెడీ స్కూల్‌లో నిర్వహించిన ప్రతిష్ఠాత్మక ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ముఖ్యమంత్రితో పాటు మొత్తం 62 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని శిక్షణను పూర్తిచేశారు.
“లీడర్‌షిప్ ఇన్ ద 21వ శతాబ్దం” అనే శీర్షికతో నిర్వహించిన ఈ కోర్సు ఆధునిక పాలన, ప్రజాపరిపాలనలో నాయకత్వ లక్షణాలు, విధాన రూపకల్పన, సంక్లిష్ట సమస్యలకు పరిష్కార మార్గాలు వంటి అంశాలపై లోతైన అవగాహనను అందించింది. ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తరగతులు కొనసాగడం ఈ శిక్షణ తీవ్రతను చాటిచెప్పింది.
అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య ఈ కార్యక్రమం జరిగింది. హార్వర్డ్‌లో ఉష్ణోగ్రతలు మైనస్ 15 డిగ్రీల నుంచి మైనస్ 24 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదైనప్పటికీ, విద్యార్థులు అధిక నిబద్ధతతో తరగతులకు హాజరై శిక్షణను కొనసాగించారు. అంతర్జాతీయ స్థాయి అధ్యాపకులు నిర్వహించిన లెక్చర్లు, కేస్ స్టడీలు, గ్రూప్ డిస్కషన్లు, ప్రాక్టికల్ సెషన్లు ఈ కోర్సుకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ రోజు కార్యక్రమం విజయవంతంగా ముగిసిన సందర్భంగా హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ అధ్యాపకులు విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పాల్గొన్న అందరూ ఈ సందర్భంగా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ శిక్షణ ద్వారా పొందిన జ్ఞానం, అనుభవం రాష్ట్ర పరిపాలనలో నూతన ఆలోచనలు అమలు చేయడానికి ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.
ప్రపంచ స్థాయి విద్యా సంస్థలో ఈ తరహా శిక్షణలో పాల్గొనడం తెలంగాణకు గర్వకారణమని పలువురు పేర్కొన్నారు. నాయకత్వ నైపుణ్యాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా ఈ కార్యక్రమం ఒక కీలక అడుగుగా నిలిచిందని విద్యార్థులు తెలిపారు.