పర్యావరణహితమే ప్రజాహితం.. -కళలు, సంప్రదాయ సాంస్కృతిక సందడిగా సాగిన “నైమిషం” ఎర్త్ ఫెస్టివల్ 2026

హైదరాబాద్, ఫిబ్రవరి 01, 2026:
“ఎర్త్‌ని మించిన వెల్త్ లేదు” అన్న సందేశాన్ని గట్టిగా వినిపిస్తూ నైమిషం – ఎర్త్ ఫెస్టివల్ 2026 మూడో ఎడిషన్ ఘనంగా జరిగింది. జె. కృష్ణమూర్తి హైదరాబాద్ సెంటర్, టీమ్ రేట్రో సంయుక్త ఆధ్వర్యంలో గచ్చిబౌలి ఖాజాగూడలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఈఎస్‌సీఐ) ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన ఈ ఒక్కరోజు పర్యావరణ ఉత్సవం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది.

పర్యావరణహిత జీవన విధానమే మానవాళి భవిష్యత్తు అని చాటిచెప్పేలా నిర్వహించిన ఈ ఫెస్టివల్‌లో 70కి పైగా స్వచ్ఛంద సంస్థలు, కళాకారులు, చేనేత కార్మికులు, కమ్యూనిటీ గ్రూపులు పాల్గొని సందడిని సృష్టించారు. ముఖ్య అతిథులుగా యునిసెఫ్ చీఫ్ ఫీల్డ్ ఆఫీసర్ డా. జెలాలెం బి. టాఫెస్సే, ఈఎస్‌సీఐ డైరెక్టర్ డా. జి. రమేశ్వర్ రావు హాజరై, పిల్లలు–భవిష్యత్ తరాలు–పర్యావరణ సంరక్షణ మధ్య ఉన్న అనుబంధాన్ని ఫెస్టివల్ బలంగా ప్రతిబింబించిందని పేర్కొన్నారు.

పద్మభూషణ్ అవార్డు గ్రహీత, నైమిషం ఎర్త్ ఫెస్టివల్ గౌరవ సలహాదారు స్వప్న సుందరి సంస్కృతి, సంప్రదాయాలు, పర్యావరణ అవగాహన మధ్య ఉన్న లోతైన సంబంధాలపై ప్రత్యేక సెషన్‌ను క్యూఱేట్ చేయడం విశేషం.

ఫెస్టివల్‌లో లెర్నింగ్ జోన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నేయడం, సహజ రంగులతో డైయింగ్, చెరియాల్ మాస్క్ పెయింటింగ్, సీడ్‌బాల్ తయారీ, రాక్ స్టాకింగ్, రంగోలి వంటి కార్యకలాపాల్లో వందలాది పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వయంగా స్పర్శించి నేర్చుకునే ఈ విధానం పిల్లల్లో ఏకాగ్రతను, పర్యావరణ బాధ్యతను పెంపొందించేలా సాగింది.

చేనేత, హస్తకళల జోన్‌లో సిద్ధిపేట, పోచంపల్లి, నారాయణపేట వంటి ప్రాంతాల నుంచి వచ్చిన నేతన్నలు సందర్శకులతో నేరుగా మమేకమయ్యారు. చేతితో నేసిన వస్త్రాలు, మొక్కల ఆధారిత ఉత్పత్తుల కొనుగోళ్లతో చేనేతకు మద్దతు లభించింది.

“వాయిసెస్ ఆఫ్ ది డెక్కన్” చర్చా వేదికలో యువ పర్యావరణ కార్యకర్త రిధిమా పాండే తరాలకతీత వాతావరణ బాధ్యతపై ప్రభావవంతమైన ప్రసంగం చేశారు. డెక్కన్ పీఠభూమి, సరస్సులు, అడవులు, రాళ్లు, హస్తకళలపై నిపుణుల చర్చలు ఆలోచన రేకెత్తించాయి.

సాంస్కృతిక కార్యక్రమాల్లో వీణా మాథ్ వయోలిన్ కచేరీ, విద్యార్థుల ప్రదర్శనలు, భద్రాచలం పాటలు అలరించాయి. “ఎ పీస్‌ఫుల్ మూవ్‌మెంట్” నృత్య-నాటకం పర్యావరణ ఉద్యమాన్ని ప్రపంచవ్యాప్త ఆవశ్యకతగా చూపించింది. డెక్కన్ ఫుడ్ జోన్‌లో స్థానిక, వీగన్ వంటకాలు రుచులను పంచగా, వ్యర్థాల వర్గీకరణ, ప్లాస్టిక్ వినియోగం తగ్గింపు వంటి చర్యలు సస్టైనబుల్ జీవనానికి దారి చూపించాయి.

మొత్తానికి, నైమిషం ఎర్త్ ఫెస్టివల్ 2026 పర్యావరణం–సంస్కృతి–జీవనశైలి సమన్వయానికి నిలువెత్తు ఉదాహరణగా నిలిచింది.

Previous Article

"కేంద్ర బడ్జెట్ పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత."

Next Article

హైదరాబాద్: శిల్పారామంలో ఘనంగా ఒడిశా ఫుడ్ అండ్ క్రాఫ్ట్ మేళా-2026 ప్రారంభం

Write a Comment

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *