హైదరాబాద్,ఫిబ్రవరి16,2026: టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారిన విషయం హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న వివాహ వార్త. తాజాగా వీరిద్దరి పెళ్లికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. ఆ పత్రిక ప్రకారం తమ కుటుంబాల ఆశీస్సులతో విజయ్–రష్మికలు ఫిబ్రవరి 26, 2026న అత్యంత సన్నిహిత బంధుమిత్రుల సమక్షంలో సరళమైన వివాహ వేడుకలో ఒక్కటి కాబోతున్నట్లు పేర్కొన్నారు.
ఆహ్వాన పత్రికలో తమ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించబోతున్నందుకు ఎంతో ఆనందంగా ఉన్నామని కూడా వెల్లడించినట్లు కనిపిస్తోంది. అంతేకాకుండా వివాహం అనంతరం సినీ ప్రముఖులు, స్నేహితుల కోసం మార్చి 4, 2026 బుధవారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో సాయంత్రం 7 గంటల నుంచి ఘనమైన వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించనున్నట్లు అందులో వివరాలు ఉన్నాయి. బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు విచ్చేసి తమ నూతన జీవిత ప్రయాణాన్ని ఆశీర్వదించాలని ఆహ్వానం పంపినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఈ ఆహ్వాన పత్రిక బయటకు రావడంతో అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. సోషల్ మీడియా వేదికలైన ఇన్స్టాగ్రామ్, ఎక్స్, ఫేస్‌బుక్‌లలో అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. కొందరు అయితే వీరిద్దరి జంట చాలా కాలంగా మంచి స్నేహం, అనుబంధం కొనసాగిస్తున్నారని గుర్తుచేస్తున్నారు.
అయితే ఈ వార్తలపై విజయ్ దేవరకొండ గాని, రష్మిక మందన్న గాని లేదా వారి కుటుంబ సభ్యులు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఇది నిజమైన ఆహ్వాన పత్రమా? లేక ఫ్యాన్స్ క్రియేషన్ మాత్రమేనా? అన్న సందేహం ఇంకా కొనసాగుతోంది. అధికారిక స్పష్టత కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.