వ్యసన రహిత భారత్ లక్ష్యంతో ఇస్కాన్ హైదరాబాద్ ‘హరే కృష్ణ రన్–2026’ ఘనంగా

ఆరోగ్యం, మైండ్‌ఫుల్‌నెస్ మరియు కాన్షియస్ లివింగ్‌ను ప్రోత్సహిస్తూ వ్యసన రహిత భారత్ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో ఇస్కాన్ హైదరాబాద్ ఆదివారం నగరంలోని నెక్లెస్ రోడ్ వద్ద సంజీవయ్య చిల్డ్రన్స్ పార్క్ ప్రాంగణంలో “హరే కృష్ణ రన్–2026”ను ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో 3,000 మందికి పైగా యువత, కుటుంబాలు, విద్యార్థులు, భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ రన్‌ను మూడు విభాగాలుగా నిర్వహించారు. 10K హరినామ్ రన్, 5K భక్తి రన్ మరియు 3K సంకీర్తన వాక్‌లలో రన్నర్లు, వాకర్లు పాల్గొని వ్యసన విముక్తి పట్ల తమ మద్దతును తెలియజేశారు. తెల్లవారుజామునే నెక్లెస్ రోడ్ పరిసరాలు హరే కృష్ణ మహామంత్రాల జపాలతో మార్మోగిపోయాయి.

పరుగును తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమల డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి జెండా ఊపి ప్రారంభించారు. ఆయనతో పాటు ESIC మెడికల్ కాలేజ్ & హాస్పిటల్, సనత్‌నగర్ డీన్ డాక్టర్ శిరీష్ కుమార్ జి. చవాన్, W3 గ్లోబల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజర్ (అడ్మిన్ & ఫెసిలిటీస్) వెంకటేష్ బట్టు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక మార్గదర్శకులు వరద కృష్ణ దాస్, ఇస్కాన్ అబిడ్స్ టెంపుల్ కన్వీనర్ శంభు వైష్ణవ్ దాస్, జనరల్ మేనేజర్ హనుమాన్ విజయ్ దాస్ మరియు గ్లోబల్ ఈవెంట్స్ బృందం 5K, 3K రన్‌లకు ఫ్లాగ్-ఆఫ్ ఇచ్చారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ యువతలో పెరుగుతున్న మాదకద్రవ్యాల వినియోగం సమాజానికి పెద్ద సవాల్‌గా మారిందన్నారు. ఆధ్యాత్మిక జీవన విధానం, యోగ, సాత్విక ఆహారం, జపం వంటి పద్ధతులు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయని, వాటి ద్వారా వ్యసనాల నుంచి దూరంగా ఉండవచ్చని వివరించారు. ప్రజలు ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించి శారీరక-మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

పరుగుల అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తి సంగీతం పాల్గొన్నవారిని ఆకట్టుకున్నాయి. చివరగా ప్రసాదం పంపిణీ చేసి కార్యక్రమాన్ని ముగించారు. ఈ రన్ ద్వారా “వ్యసన రహిత భారత్” సందేశాన్ని సమాజంలోని ప్రతి వర్గానికి చేర్చడమే తమ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

Previous Article

హైదరాబాద్: రెడ్ హిల్స్‌లోని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలో భారీ అగ్నిప్రమాదం

Next Article

సైబర్ నేరగాళ్లపై హైదరాబాద్ పోలీసుల ఉక్కుపాదం – జనవరిలో 37 మంది అరెస్ట్, రూ.65 కోట్ల లావాదేవీలు బట్టబయలు

Write a Comment

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *