– మూసీ నది పునరుజ్జీవనంకు స్పూర్తిగా సబర్మతి రివర్‌ఫ్రంట్ నమూనా
అహ్మదాబాద్, 09 జనవరి 2026:
నగర నదీ పరివాహక తీరాన్ని పర్యాటకంగా అభివృద్ధికి ఉత్తమ విధానాలు, నమూనాలను అవగాహన చేసుకునే ఉద్దేశంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) కార్పొరేటర్ల బృందం స్టడీ టూర్ లో భాగంగా గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లోని సబర్మతి రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టును శుక్ర,శనివారాల్లో సందర్శించింది.
మేయర్ గద్వాల్ విజయలక్ష్మి నేతృత్వంలో మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి , కార్పొరేటర్ల బృందం గురువారం, శుక్రవారం పర్యటించింది.
ఈ సందర్భంగా అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (ఏఎంసీ) ప్రజాపతి విజయ్, సబర్మతి రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎస్‌ఆర్‌ఎఫ్‌డీసీఎల్) ప్రతినిధులు ప్రాజెక్టు రూపకల్పన, ప్రణాళిక, అమలు విధానాలను జీహెచ్‌ఎంసీ బృందానికి వివరించారు.
ఒకప్పుడు నిర్లక్ష్యానికి గురైన సబర్మతి నది పరివాహక తీరాన్ని ప్రజలకు అనుకూలమైన పర్యాటక, వినోద ప్రాంతాలుగా మార్చిన విధానాన్ని వారు వివరించారు.
సబర్మతి రివర్ ఫ్రంట్ ను 7 దశల్లో అభివృద్ధి చేయనుండగా, మొదటి దశ 11.5 కిలో మీటర్ల మేర అభివృద్ధి పనులు పూర్తి అయ్యాయన్నారు.
రెండో దశ మరో 6 నెలల్లో పూర్తి కానుందన్నారు. సబర్మతి రివర్ ఫ్రంట్ ను అభివృద్ధి చేయాలని సంకల్పించిన వెంటనే ఓ ఆర్గనైజేషన్ ప్రత్యేకంగా దీనికోసం ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. వాస్తవ నివసితులతో నేరుగా చర్చించామనీ చెప్పారు. పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా చూశామని తెలిపారు.
పునరావాసం, ఇతర ప్రయోజనాలు నేరుగా నిర్వాసితులకు అందించామని తెలిపారు. నది ఇరువైపులా మేర విస్తరించిన ఈ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టు వరద నియంత్రణ, పర్యావరణ పునరుద్ధరణ, పట్టణ పునరుజ్జీవనాన్ని సమన్వయం చేస్తూ, వాకింగ్ ట్రాక్ లు, పార్కులు, తోటలు, వినోద సౌకర్యాలను కల్పిస్తోంది.
థీమ్ పార్కులు, తూర్పు–పడమర తీరాలను కలుపుతున్న అద్భుతమైన అటల్ ఫుట్ బ్రిడ్జిను బృందం సందర్శించింది.
సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ జీహెచ్ఎంసీ బృందాన్ని ఆకర్షించింది.
ఈ అధ్యయన పర్యటన హైదరాబాద్‌లో మూసి నదీ తీరాభివృద్ధి, పబ్లిక్ స్థలాల నిర్వహణ, పౌర కేంద్రిత నగర అభివృద్ధికి మార్గనిర్దేశకంగా నిలుస్తుందని జీహెచ్‌ఎంసీ బృందం అభిప్రాయపడింది.
ఈ రివర్ ప్రాజెక్ట్ క్షేత సందర్శన సహా స్టడీ టూర్ లో గుర్తించిన బెస్ట్ ప్రాక్టీసెస్ కు సంబంధించిన
సమగ్ర నివేదికను బృందం జీహెచ్ఎంసీ, ప్రభుత్వానికి సమర్పించనుంది.