సంగారెడ్డిలో హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు

రేవంత్ రెడ్డి హామీలు నెరవేర్చలేకపోయారు – ప్రజలు అసలు, నకిలీ ఎవరో గుర్తించారు: హరీష్ రావు

సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు సంగారెడ్డి పట్టణంలో విస్తృత రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి గులాబీ జెండాలతో, ‘జై తెలంగాణ–జై కేసీఆర్’ నినాదాలతో మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, భూపాలపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. హామీలు ఇచ్చి అమలు చేయని వారే అసలైన నకిలీ నాయకులని ప్రజలు ఇప్పటికే గుర్తించారని అన్నారు. కమిషన్ల కోసం వేల కోట్ల రూపాయల టెండర్లకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కానీ ఉద్యోగులు, పేదలు, పెన్షనర్లకు ఇవ్వాల్సిన బకాయిలకు డబ్బులు లేవని చెప్పడం దుర్మార్గమని విమర్శించారు.

ఉమ్మడి మెదక్ జిల్లా అంతటా బీఆర్ఎస్‌కు అనుకూల వాతావరణం ఉందని, సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్, కోహిర్, నర్సాపూర్, మెదక్ ప్రాంతాల్లో గులాబీ జెండానే ఎగురుతోందని హరీష్ రావు పేర్కొన్నారు.

కేసీఆర్ హయాంలో సంగారెడ్డి పట్టణానికి భారీ అభివృద్ధి జరిగిందని తెలిపారు. ఇంటింటికి తాగునీరు, రోడ్లు, వీధి దీపాలు, డివైడర్లు, అలాగే మెడికల్, నర్సింగ్ కళాశాలల మంజూరుతో పట్టణానికి రూపురేఖలు మారాయని గుర్తు చేశారు. TUFIDC, SDF నిధులతో కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లు గడిచినా సంగారెడ్డిలో ఒక్క రూపాయి పనైనా జరిగిందా అని ప్రశ్నించారు. ఎన్నికలు దగ్గరపడగానే శంక్షన్లు, టెండర్లు లేకుండా పనులు మొదలుపెట్టి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

ఉద్యోగులకు పీఆర్సీ, డీఏ బకాయిలు, పెన్షనర్లకు పెరిగిన పెన్షన్లు, పేదలకు మహాలక్ష్మి పథకం అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని హరీష్ రావు అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా విమర్శల రాజకీయాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధిని కొనసాగించాలని సంగారెడ్డి ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.

Previous Article

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై పోలీసుల ఉక్కుపాదం

Next Article

భూపాలపల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి విమర్శల మోత — సింగరేణి, ఇళ్లు, అభివృద్ధిపై హామీలు

Write a Comment

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *