Filmfare Awards South 2026: అల్లు అర్జున్‌కు బెస్ట్ యాక్టర్, ‘అమరన్’కు 8 అవార్డులు
ఫిబ్రవరి 21, 2026న కేరళ టూరిజం భాగస్వామ్యంతో 70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ కార్యక్రమం తొలిసారిగా కొచ్చిలో అంగరంగ వైభవంగా జరిగింది. 2024 సంవత్సరానికి సంబంధించిన మలయాళం, తెలుగు, తమిళ, కన్నడ చిత్ర పరిశ్రమల అత్యుత్తమ ప్రతిభను ఈ వేడుకలో సత్కరించారు. దక్షిణాది సినీ రంగానికి ఇది ఒక అరుదైన కార్యక్రమంగా నిలిచింది.
తెలుగు సినీ పరిశ్రమకు విజయోత్సవ రాత్రి
తెలుగు విభాగంలో ‘పుష్పా 2: ది రూల్’ ఐదు అవార్డులతో అగ్రస్థానంలో నిలిచింది. ఉత్తమ చిత్రం అవార్డుతో పాటు హీరో అల్లు అర్జున్ ఉత్తమ నటుడు (Best Actor) అవార్డును అందుకున్నాడు. ట్రోఫీ స్వీకరిస్తూ వేదికపై తన ప్రసిద్ధ డైలాగ్, సిగ్నేచర్ పోజ్‌తో అభిమానులను అలరించాడు.
“ఇది నా హ్యాట్రిక్ విజయం, ఏడవ ఫిల్మ్‌ఫేర్ అవార్డు. సినిమా ఒక సమిష్టి కృషి; ఈ గౌరవం మొత్తం బృందానిదే,” అని ఆయన అన్నారు.
‘దేవర పార్ట్–1’, ‘కల్కి 2898 ఏడీ’, ‘కమటీ కుర్రోలు’, ‘గుంటూరు కారం’ చిత్రాలు తలా రెండు అవార్డులు సాధించాయి. ‘కల్కి 2898 ఏడీ’లో అమితాబ్ బచ్చన్ ఉత్తమ సహాయ నటుడు అవార్డు గెలుచుకోగా, ‘సత్యభామ’ చిత్రానికి కాజల్ అగర్వాల్ క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు.
మలయాళ చిత్రసీమలో మమ్ముట్టి మెరుపు
మలయాళ విభాగంలో ‘భ్రమయుగం (2024)’ చిత్రానికి మమ్ముట్టి ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. ఇది తన 16వ ఫిల్మ్‌ఫేర్ అవార్డు అని ఆయన ఆనందం వ్యక్తం చేశాడు.
‘ఆడు జీవితం’ ఐదు అవార్డులతో ప్రధాన విజేతగా నిలవగా, ‘కిష్కిందా కాండం’ నాలుగు అవార్డులు గెలుచుకుంది. ఆసిఫ్ అలీ, పృథ్వీరాజ్ సుకుమారన్ క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ నటుడు గౌరవాన్ని పంచుకున్నారు.
తమిళ విభాగంలో ‘అమరన్’ ఆధిపత్యం
తమిళ విభాగంలో ‘అమరన్’ ఎనిమిది అవార్డులతో ఆధిపత్యం చెలాయించింది. శివకార్తికేయన్ ఉత్తమ నటుడిగా, సాయి పల్లవి ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. తన అవార్డును కథ వెనుక ఉన్న కుటుంబానికి అంకితం చేస్తూ సాయి పల్లవి భావోద్వేగంగా స్పందించారు.