హైదరాబాద్: నగరంలో ఆహార భద్రతపై మరోసారి ఆందోళన కలిగించే ఘటన వెలుగులోకి వచ్చింది. జియాగూడ ప్రాంతంలో అక్రమంగా నడుస్తున్న సమోసా తయారీ కేంద్రంపై హైదరాబాద్ పోలీసులు దాడి చేసి, భారీ స్థాయిలో అనారోగ్యకర పరిస్థితుల్లో తయారవుతున్న ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
Thank you for reading this post, don't forget to subscribe!
శుక్రవారం సాయంత్రం టాస్క్ ఫోర్స్ ఫుడ్ సేఫ్టీ విభాగం (H-FAST) అధికారులు, కుల్సుంపురా పోలీసులతో కలిసి ఈ దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యూనిట్‌లో సరైన అనుమతులు లేకుండా సమోసాలను తయారు చేస్తున్నట్లు గుర్తించారు.
పోలీసుల వివరాల ప్రకారం, 73 ఏళ్ల హృద్దుడు ఈ యూనిట్‌ను నడుపుతున్నాడు. కొంతమంది కార్మికుల సహాయంతో అతడు అస్వచ్ఛమైన వాతావరణంలో సమోసాలు తయారు చేస్తున్నట్లు బయటపడింది. పాడైపోయిన గుడ్లు, నాసిరకం పదార్థాలు ఉపయోగించడం, వంట నూనెను మళ్లీ మళ్లీ వినియోగించడం వంటి అంశాలు బయటపడి, ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా మారినట్లు అధికారులు తెలిపారు.
దాడి సమయంలో వందల సంఖ్యలో తయారైన సమోసాలు, పాడైన గుడ్లు, భారీగా నిల్వ ఉంచిన ముడి సరుకులు సహా మొత్తం రూ.5 లక్షల విలువైన ఆహార పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే తయారీకి ఉపయోగిస్తున్న పరికరాలను కూడా సీజ్ చేశారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి, పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. నగరంలో అనుమతి లేకుండా నడుస్తున్న ఆహార తయారీ కేంద్రాలపై ఇలాంటి దాడులు కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు.
Hyderabad: Food Safety Department raids illegal samosa manufacturing unit
