హైదరాబాద్: వింగ్స్ ఇండియా 2026లో శుక్రవారం నిర్వహించిన వైమానిక ప్రదర్శనలో Surya Kiran Aerobatic Team (SKAT) తమ అద్భుత విన్యాసాలతో వేలాది మంది ప్రేక్షకులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. విమానాల గర్జనతో ఆకాశం మార్మోగుతుండగా, ప్రేక్షకులు ఉత్సాహంగా ఫోన్లు ఎత్తి ఆ అపూర్వ దృశ్యాలను చిత్రీకరించారు.
కర్ణాటకలోని బీదర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి బయలుదేరిన తొమ్మిది హాక్ ఎంకే–132 విమానాలు జాతీయ త్రివర్ణ ఆకారంలో రంగుల పొగతో ఆకాశంలో ప్రత్యక్షమయ్యాయి. గ్రూప్ కెప్టెన్ అజయ్ దాసరథి నాయకత్వంలో SKAT పటిష్టమైన సమన్వయం, కచ్చితమైన సమయం, ఖచ్చితమైన దూరం పాటిస్తూ విన్యాసాలు ప్రదర్శించింది.
ప్రదర్శన ప్రారంభంలో తేజస్ విమానాల ఫార్మేషన్ ఆకట్టుకుంది. అనంతరం దేశ యువతకు అంకితంగా ‘Y’ అక్షరాకార ఫార్మేషన్‌ను రూపొందించగా, ప్రేక్షకుల నుంచి భారీ చప్పట్లు వెల్లువెత్తాయి. ఆపై అందమైన డైమండ్ ఆకారంలోకి మారిన విమానాలు మరోసారి ఆశ్చర్యపరిచాయి.
ప్రదర్శనలో ప్రధాన ఆకర్షణగా మూడు విమానాలు ఒకే గీతలో ప్రయాణించి వేర్వేరు దిశలుగా విస్తరిస్తూ ఆకాశంలో ప్రేమ (love) చిహ్నాన్ని చిత్రీకరించాయి.
చివరగా టీమ్ లీడర్ కాక్‌పిట్ నుంచి
“సూర్యకిరణ్ టీమ్ హైదరాబాద్ ప్రజలందరికీ… బ్లూ స్కైస్ అండ్ హ్యాపీ ల్యాండింగ్స్… జై హింద్”
అనే ప్రత్యేక సందేశం వినిపించడంతో ప్రదర్శనకు ఘన ముగింపు పలికింది.
నేను తొలిసారి ఎయిర్ షో చూస్తున్నాను. సూర్యకిరణ్ టీమ్ ఎంట్రీ నాకు గూస్‌బంప్స్ తెప్పించింది. ఆకాశంలో ప్రేమ చిహ్నం, త్రివర్ణం అద్భుతంగా అనిపించాయి, అని తల్లిదండ్రులతో షోకు వచ్చిన అభిమన్యు ఆనందం వ్యక్తం చేశాడు.
SKAT ప్రదర్శనకు ముందు, అంతర్జాతీయ ఖ్యాతి పొందిన గ్లోబల్ స్టార్స్ ఏరోబాటిక్ టీమ్ కూడా ప్రేక్షకులను అలరించింది. ప్రపంచ ప్రఖ్యాత విమాన పైలట్ Mark Jeffery నేతృత్వంలోని ఈ యూకే ఆధారిత బృందం హై–పర్ఫార్మెన్స్ Extra 330SC విమానాలతో డైమండ్ ఫార్మేషన్, బిగ్ లూప్, ప్యారలల్ రోల్ వంటి విన్యాసాలు ప్రదర్శించింది. డైమండ్ ఫార్మేషన్‌లో లూప్ చేయడం, ఖచ్చితమైన క్రాసింగ్ విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆకాశంలో జంట ప్రేమ చిహ్నాలు చిత్రీకరిస్తూ గ్లోబల్ స్టార్స్ టీమ్ తమ ప్రదర్శనకు ముగింపు పలికింది.
విమాన ప్రదర్శనలు శనివారం కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. టికెట్లు BookMyShow వెబ్‌సైట్‌లో లభ్యమవుతున్నాయి.