మహిళా భద్రతకు ‘‘She Netra Teams’ – Hyderabad నగరవ్యాప్తంగా రహస్య కెమెరాలపై కఠిన చర్యలు
మహిళల భద్రత, వ్యక్తిగత గోప్యత పరిరక్షణకు హైదరాబాద్ పోలీసులు కీలక అడుగు వేశారు. రహస్య కెమెరాల బెడదను అరికట్టేందుకు ‘‘She Netra Teams’ పేరుతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నగర కమిషనరేట్ పరిధిలోని ఏడు జోన్లకు ఒక్కో బృందం చొప్పున మొత్తం ఏడు టీమ్స్‌ను రంగంలోకి దించారు.
బషీర్‌బాగ్‌లోని పాత కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ VC Sajjanar, IPS ఈ ప్రత్యేక బృందాలకు అత్యాధునిక కెమెరా డిటెక్టర్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, షాపింగ్ మాల్స్ ట్రయల్ రూమ్స్, హోటళ్లు, హాస్టళ్లు, ఆస్పత్రులు, విద్యాసంస్థలు వంటి ప్రైవేట్ ప్రదేశాల్లో రహస్యంగా కెమెరాలు అమర్చడం ద్వారా మహిళల గోప్యతకు భంగం కలిగించే ఘటనలను ఏమాత్రం ఉపేక్షించబోమన్నారు.
ఈ షీ నేత్ర టీమ్స్‌కు ప్రత్యేక శిక్షణ ఇచ్చి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించేలా సిద్ధం చేశారు. నగరవ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు చేపట్టి, ఎక్కడైనా నిబంధనలు ఉల్లంఘించినట్లయితే సంబంధిత యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని సజ్జనర్ హెచ్చరించారు. అవసరమైతే సంస్థలను బ్లాక్‌లిస్ట్ చేయడం, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం కూడా జరుగుతుందని స్పష్టం చేశారు.
ప్రతి సంస్థ తప్పనిసరిగా ‘కస్టమర్ సేఫ్టీ ఇన్‌చార్జ్’ను నియమించుకోవాలని, వీరు షీ టీమ్స్‌తో సమన్వయం చేసుకుంటూ భద్రతా చర్యలను అమలు చేయాలని సూచించారు. పోలీసుల ఆధ్వర్యంలో వీరికి శిక్షణ ఇవ్వబడుతుందని, కెమెరా డిటెక్టర్లు కూడా యాజమాన్యమే సమకూర్చుకోవాలని తెలిపారు.
మహిళల భద్రత సమిష్టి బాధ్యత అని పేర్కొంటూ, ఎక్కడైనా అనుమానాస్పద పరికరాలు గమనిస్తే వెంటనే డయల్ 100/112 లేదా షీ టీమ్స్ హెల్ప్‌లైన్ 9490616555కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో Srinivasulu Additional CP Crimes, Dr. Lavanya DCP Women Safety Wing, Prasanna ACP She Teams తదితరులు పాల్గొన్నారు.
She Netra Teams Launched: Crackdown on Hidden Cameras in Hyderabad
