హైదరాబాద్: నగరంలోని బోరబండ పరిధిలో విద్యుదాఘాతానికి గురై 26 ఏళ్ల మహిళ మృతి చెందింది. భారత్ నగర్లో ఆదివారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. బకెట్లో వేడి నీటిని స్టీల్ పాత్రతో తీసుకునే ప్రయత్నంలో ఇమ్మర్షన్ వాటర్ హీటర్ ఆన్‌లో ఉండటంతో ఆమెకు విద్యుత్ షాక్ తగిలినట్లు పోలీసులు తెలిపారు.
బోరబండ పోలీసుల వివరాల ప్రకారం.. మృతురాలు ఆయేషా సిద్ధిఖీ తన భర్త అబ్దుల్ రవూఫ్‌తో కలిసి భారత్ నగర్లో నివసిస్తోంది. వీరిది కామారెడ్డి జిల్లా గాంధారి ప్రాంతం. ఈ దంపతులకు రెండేళ్ల క్రితం వివాహం కాగా, ఏడాది వయసున్న కుమారుడు ఉన్నాడు.
ఆదివారం సాయంత్రం ఇంట్లో బకెట్లో వేడి నీటిని సిద్ధం చేసుకున్న ఆయేషా, వాటర్ హీటర్‌ను ఆఫ్ చేయకుండానే స్టీల్ పాత్రతో నీటిని తీసేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆమె విద్యుదాఘాతానికి గురై స్పృహ కోల్పోయి కిందపడిపోయింది.
కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే, అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
ఇదిలా ఉండగా, ఇమ్మర్షన్ వాటర్ హీటర్ల వినియోగంపై విద్యుత్ అధికారులు ప్రజలకు కీలక సూచనలు చేశారు. హీటర్ ఆన్‌లో ఉన్నప్పుడు దానిని లేదా నీటిని తాకరాదని హెచ్చరించారు. వేడి నీటిని ఉపయోగించే ముందు విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపివేయాలని సూచించారు.
వాటర్ హీటర్‌ను ఉపయోగించే సమయంలో నిర్లక్ష్యం ప్రాణాపాయానికి దారితీయవచ్చని, విద్యుత్ భద్రతా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు.
