హైదరాబాద్: విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలకు నివాళిగా హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో గురువారం నగరవ్యాప్తంగా మెగా రక్తదాన శిబిరాలు నిర్వహించారు. నగర కమిషనరేట్ పరిధిలోని 38 కేంద్రాల్లో సుమారు 30 బ్లడ్ బ్యాంకుల సహకారంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో 5,700 యూనిట్ల రక్తాన్ని సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించారు.
పేట్లబురుజులోని సీఏఆర్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ప్రారంభించారు. పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. అక్టోబర్ 21 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా పోలీసు అమరవీరుల స్మరణార్థం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమాజ రక్షణ కోసం పోలీసులు పండుగలు, సెలవులను సైతం పక్కనపెట్టి విధులు నిర్వహిస్తున్నారని కొనియాడారు. రక్తదానం ప్రాణాలను కాపాడే గొప్ప సేవ అని, సేకరించిన రక్తం ప్రభుత్వ ఆసుపత్రులకు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. ముఖ్యంగా తలసేమియా బాధిత చిన్నారులు, రోడ్డు ప్రమాదాల్లో గాయపడినవారు, క్యాన్సర్ రోగులకు ఈ రక్తం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. రక్తదానం, అవయవదానంపై ప్రజల్లో అవగాహన పెంచాలని పిలుపునిచ్చారు.
నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ.. అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ వారికి నిజమైన నివాళి అర్పించాలనే ఉద్దేశంతో ఈ శిబిరాలను నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ఉస్మానియా, గాంధీ, నిమ్స్, కింగ్ కోఠి, నిలోఫర్, ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రులు, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ప్రతినిధులతో పాటు రెడ్ క్రాస్, తలసేమియా ఫౌండేషన్, రోటరీ, లయన్స్ క్లబ్ వంటి సంస్థలకు, రక్తదాతలకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ ప్రజోపయోగ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో అదనపు పోలీస్ కమిషనర్లు ఎం. శ్రీనివాసులు, తప్సీర్ ఇక్బాల్, జాయింట్ సీపీ జోయల్ డేవిస్, డీసీపీలు ఆర్. వెంకటేశ్వర్లు, రాహుల్ హెడ్గే, లావణ్య నాయక్ జాదవ్ తదితర అధికారులు, వైద్యులు, బ్లడ్ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.
