Uppal Stadium లో కనిపించిన Arjun Tendulkar నిజమైన కథ
హైదరాబాద్‌లోని Rajiv Gandhi International Cricket Stadiumలో జరిగిన IPL మ్యాచ్‌ను కవర్ చేయడానికి ఒక న్యూస్ ఫోటోగ్రాఫర్‌గా వెళ్లిన నేను, సాధారణంగా ఆశించే సన్నివేశాలు,బౌండరీలు, వికెట్లు, సెలబ్రేషన్స్ కంటే భిన్నమైన ఒక క్షణాన్ని చూశాను. Sunrisers Hyderabad (SRH) మరియు Lucknow Super Giants (LSG) మధ్య మ్యాచ్ ఉత్కంఠగా సాగుతుండగా, నా కెమెరా ఒక సైలెంట్ స్టోరీని పట్టుకుంది. గ్రౌండ్‌లో తన సహచర ఆటగాళ్లకు డ్రింక్స్ అందిస్తూ కనిపించిన వ్యక్తి Arjun Tendulkar.
అతను సాధారణ ఆటగాడు కాదు. అతను భారత రత్న Sachin Tendulkar కుమారుడు, భారత క్రికెట్ చరిత్రలో ఒక మహానుభావుడి వారసుడు. కానీ ఆ క్షణంలో అతను ఒక స్టార్ కాదు, ఒక లెజెండ్ కొడుకు కాదు, ఒక సాధారణ టీమ్ మెంబర్ మాత్రమే. అదే ఆ దృశ్యాన్ని ప్రత్యేకంగా మార్చింది. అతని ముఖంలో ఎలాంటి అసహనం కనిపించలేదు, బదులుగా ప్రశాంతత, అంగీకారం, మరియు తనకంటూ ఒక గుర్తింపును నిర్మించుకోవాలనే నిశ్శబ్ద తపన కనిపించింది.
ప్రపంచం చాలా సార్లు వారసత్వాన్ని ఒక షార్ట్‌కట్‌గా చూస్తుంది. కానీ నిజానికి అది ఒక ప్రారంభం మాత్రమే. “Tendulkar” అనే పేరు ఒక తలుపు తెరవొచ్చు, కానీ ఆ తలుపు దాటి ముందుకు నడవడం మాత్రం Arjun బాధ్యత. అతను ఆ ప్రయాణాన్ని అర్థం చేసుకున్నట్టే కనిపించాడు. అతను స్పాట్‌లైట్ కోసం పరుగెత్తడం లేదు, అతను తన సమయాన్ని ఎదురుచూస్తున్నాడు.
క్రీడల్లోనూ, జీవితంలోనూ, ప్రతి ఒక్కరికీ ఒక దశ వస్తుంది, అది మనం వెనుకనుండి నేర్చుకునే దశ. ఆ రోజు Uppal మైదానంలో Arjun అదే దశలో ఉన్నాడు. డ్రింక్స్ అందించడం చిన్న పని అనిపించవచ్చు, కానీ ఆ పని చేసే విధానం అతని మనస్తత్వాన్ని చూపించింది. అది వినయం, క్రమశిక్షణ, మరియు టీమ్ స్పిరిట్‌కు ప్రతీకగా కనిపించింది.
ఒక సభ లో K. T. Rama Rao గారు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయ్, “వారసత్వం మొదటి అడుగు మాత్రమే” ఆ తర్వాత మన గుర్తింపును మనమే సృష్టించుకోవాలి.” ఈ భావన కేవలం రాజకీయాలకు మాత్రమే కాదు; క్రీడలు, కళలు, వ్యాపారం,ప్రతి రంగంలోనూ వర్తిస్తుంది. కుటుంబ నేపథ్యం ఒక వేదికను ఇస్తుంది, కానీ ఆ వేదికపై నిలబడి మన ప్రతిభను నిరూపించుకోవడం మన బాధ్యత.
ఒక న్యూస్ ఫోటోగ్రాఫర్‌గా నేను ఎన్నో కోణాలు చూస్తాను. కానీ కొన్ని దృశయాలు కెమెరాలో మాత్రమే కాదు, మనసులో కూడా నిలిచిపోతాయి. Arjun Tendulkar డ్రింక్స్ అందిస్తున్న ఆ క్షణం కూడా అలాంటిదే. ఎందుకంటే అది ఒక సాధారణ చర్యలో దాగిన అసాధారణ సందేశం.
జీవితంలో చాలా మంది పెద్ద పేర్లతో ప్రారంభిస్తారు. కానీ ఆ పేరును నిలబెట్టుకోవడం, దానిని మించి వెళ్లడం మాత్రం కష్టంతోనే సాధ్యం. Arjun ఆ రోజు చూపించిన సాధారణత, అతని ప్రయాణం ఎంత గొప్పదో ముందే సూచించింది.
ఉప్పల్ స్టేడియంలో కనిపించిన ఆ చిన్న దృశ్యం నాకు ఒక పెద్ద సత్యాన్ని గుర్తుచేసింది.
పేర్లు వారసత్వంగా రావచ్చు… కానీ గుర్తింపు మాత్రం కష్టంతోనే సంపాదించాలి.
