HMWSSB vigilance team ప్రజలకు ముఖ్య సూచన:
ఒకవేళ తక్కువ ప్రెజర్ తో నీరు సరఫరా అయినా.. లేదా నీటి సరఫరాలో ఏవైనా ఇతర సమస్యలు తలెత్తినా.. తమకు దగ్గర్లోని సంబంధిత మేనేజర్, డీజీఎం, జీఎం అధికారులను సంప్రదించాలి. లేదా జలమండలి కస్టమర్ కేర్ నంబరు 155313 కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. వాటిపై తప్పకుండా తగిన చర్యలు తీసుకుని సమస్యల్ని పరిష్కరిస్తారు.
హైదరాబాద్, ఏప్రిల్ 9:
హైదరాబాద్ మహానగరానికి తాగునీటి సరఫరా వ్యవస్థను సమర్థంగా నిర్వహిస్తున్న జలమండలి, అక్రమంగా నల్లాలకు మోటార్లు బిగించి నీటిని దుర్వినియోగం చేస్తున్న వారిపై కఠిన చర్యలు చేపట్టింది. జీహెచ్ఎంసీ పరిధి నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించిన నగరానికి దూర ప్రాంతాల నుంచి పైపులైన్ల ద్వారా నీటిని సరఫరా చేయడానికి భారీ వ్యయంతో ప్రణాళికలు అమలు చేస్తున్నప్పటికీ, కొంతమంది వినియోగదారులు నిబంధనలు ఉల్లంఘిస్తూ నేరుగా పైపులకు మోటార్లు బిగించడం అధికారుల దృష్టికి వచ్చింది.
ఇలా అక్రమంగా మోటార్లు వినియోగించడం వల్ల ఇతర ప్రాంతాల వినియోగదారులకు తక్కువ ఒత్తిడితో నీటి సరఫరా జరుగుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో జలమండలి విజిలెన్స్ విభాగం క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తూ చర్యలు తీసుకుంటోంది.
బుధవారం రోజున ఓ అండ్ ఎం డివిజన్ నంబర్-6 పరిధిలోని ఎస్ఆర్ నగర్ ప్రాంతంలోని ఎస్ఆర్టి కాలనీలో స్థానికుల ఫిర్యాదు మేరకు అధికారులు తనిఖీలు చేపట్టారు. నీటి సరఫరా సమయంలో పర్యటించిన విజిలెన్స్ సిబ్బంది, పైపులైనుకు అక్రమంగా బిగించిన ఏడు మోటార్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
జలమండలి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, నల్లాలకు మోటార్లు బిగించడం చట్టరీత్యా నేరం. ఇలాంటి చర్యలకు పాల్పడినవారిపై నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేయడంతో పాటు మోటార్లను స్వాధీనం చేసుకుంటారు. రెండోసారి పట్టుబడితే రూ.5,000 జరిమానా విధించడంతో పాటు మరింత కఠిన చర్యలు తీసుకుంటారు.
వినియోగదారులు నిబంధనలు పాటిస్తూ నీటి వినియోగంలో సహకరించాలని జలమండలి విజ్ఞప్తి చేసింది. నగరంలోని ప్రతి ఒక్కరికీ సమానంగా తాగునీరు అందించాలంటే అక్రమ చర్యలను నివారించడం అత్యంత అవసరమని అధికారులు సూచించారు.
HMWSSB vigilance team seized seven illegal water motors
