హైదరాబాద్: తన 50వ జన్మదినాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (కల్వకుంట్ల తారక రామారావు) సామాజిక బాధ్యతతో కూడిన కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్థికంగా వెనుకబడిన 50 మంది యువతుల విద్య, నైపుణ్యాభివృద్ధి, సాధికారతకు తాను పూర్తి స్థాయిలో స్పాన్సర్‌గా వ్యవహరిస్తానని ప్రకటించారు.
శుక్రవారం ఫిల్మ్‌నగర్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన SPARSA 2026 వార్షిక సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సమాజానికి తిరిగి సేవ చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. తన ఈ చిన్న ప్రయత్నం మరింత మంది సేవా కార్యక్రమాల వైపు ముందుకు రావడానికి స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు.
మహిళల విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పన కోసం ‘టచ్ ఎ లైఫ్’ కార్యక్రమం ద్వారా SPARSA సంస్థ చేస్తున్న సేవలను కేటీఆర్ ప్రశంసించారు. వేలాది కుటుంబాల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకొస్తున్న సంస్థ కృషి అభినందనీయమని అన్నారు.
మహిళల సామాజిక, ఆర్థిక సాధికారత కోసం చేపట్టే కార్యక్రమాలకు భవిష్యత్తులోనూ తన పూర్తి సహకారం ఉంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమానికి సినీ నటి, సామాజిక కార్యకర్త అమల అక్కినేని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళల విద్య, స్వావలంబన కోసం సమిష్టి కృషి అవసరమని ఆమె ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
KTR to Sponsor Education of 50 Underprivileged Girls on His 50th Birthday
