మాధవ్ హీరోగా పరిచయం అవుతున్న గ్రామీణ యాక్షన్ డ్రామా ‘మారెమ్మ’ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘బావ బావ’ విడుదలై ప్రేక్షకుల మనసులను దోచుకుంటోంది. మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు, నటుడు రఘు కుమారుడు అయిన మాధవ్ ఈ చిత్రంతో హీరోగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ సినిమాకు మంచాల నాగరాజ్ దర్శకత్వం వహించగా, మయూర్ రెడ్డి బండారు మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్‌కు మంచి స్పందన రావడంతో ఈ సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.
ఇప్పుడు విడుదలైన ‘బావ బావ’ పాట మాత్రం సినిమాపై అంచనాలను ఇంకో మెట్టుకు తీసుకెళ్లింది. ఈ పాటకు ప్రశాంత్ ఆర్ విహారి అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబించే మట్టి వాసనతో కూడిన మెలోడీకి మోడరన్ మ్యూజిక్ టచ్ జోడించడం ద్వారా ఒక ప్రత్యేకమైన సంగీత అనుభూతిని సృష్టించారు. ఈ పాట వినడానికి ఎంతో ప్లెజెంట్‌గా ఉండటమే కాకుండా, హృదయాన్ని తాకేలా సాగుతుంది.
కమల్ ఎస్లవత్ రాసిన సాహిత్యం ఎంతో సింపుల్‌గా, హృదయానికి దగ్గరగా ఉంటుంది. బావపై ఉన్న ప్రేమ, ఆప్యాయతలను చక్కగా వ్యక్తపరుస్తూ గ్రామీణ భావజాలాన్ని ప్రతిబింబిస్తుంది. శృతి రంజని తన స్వరంతో ఈ పాటకు మరింత ప్రాణం పోశారు. ఆమె గాత్రంలో ఉన్న సహజత్వం, రస్టిక్ టచ్ ఈ మెలోడీని మరింత అందంగా మార్చాయి.
ఈ పాటలో మాధవ్, దీపా బాలు మధ్య కనిపించే కెమిస్ట్రీ ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. వారి నటనలో ఉన్న సహజత్వం, భావ వ్యక్తీకరణ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. పల్లెటూరి అందమైన లోకేషన్లు, సహజమైన విజువల్స్ ఈ పాటను ఒక విజువల్ ట్రీట్‌గా నిలబెడుతున్నాయి.
టెక్నికల్‌గా కూడా సినిమా మంచి ప్రమాణాలతో రూపొందుతోంది. సినిమాటోగ్రఫీని ప్రశాంత్ అంకిరెడ్డి అందించగా, విజువల్స్‌కు ప్రత్యేకమైన అందాన్ని తీసుకువచ్చారు. ఎడిటింగ్ బాధ్యతలను దేవ్ రాథోడ్ నిర్వహించగా, ఆర్ట్ డైరెక్షన్‌ను రాజ్‌కుమార్ మురుగేసన్ చేపట్టారు. మొత్తం మీద ‘మారెమ్మ’ సినిమా ఒక గ్రామీణ నేపథ్యంతో కూడిన భావోద్వేగ కథగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.
ఇప్పటికే ‘బావ బావ’ పాట మంచి స్పందన అందుకుంటుండగా, సినిమా విడుదలపై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ చిత్ర విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.
