హైదరాబాద్, జూన్ 14:
సాధారణంగా రాజకీయ నేతలు, పార్టీ కార్యకర్తలు, ప్రజా సమస్యలతో వచ్చే వారితో సందడిగా ఉండే తెలంగాణ భవన్‌లో ఆదివారం ఆసక్తికరమైన దృశ్యం కనిపించింది. రాజకీయాలపై ఆసక్తి, సమాజంలో మార్పు తీసుకురావాలనే సంకల్పంతో నలుగురు జెన్-జీ యువతులు నేరుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి తమ ఆలోచనలను పంచుకున్నారు.
ఉన్నత విద్య కోసం సిద్ధమవుతున్న ఈ యువతులు తమ భవిష్యత్తులో రాజకీయ నాయకులుగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేటీఆర్‌కు తెలిపారు. ఇప్పటికే పాఠశాల దశ నుంచే ఒక బృందంగా కలిసి పాలసీ అంశాలపై చర్చలు జరుపుతూ, సమాజంలో సానుకూల మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నామని వివరించారు. భవిష్యత్తులో కూడా కలిసి ప్రజా జీవితంలో కొనసాగాలని తమ సంకల్పాన్ని వెల్లడించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ వారితో కొంతసేపు ముచ్చటించి వారి ఆలోచనలను అభినందించారు. ప్రస్తుతం ఎక్కువ మంది యువత కెరీర్‌లు, ఉద్యోగాల వైపు దృష్టి సారిస్తున్న సమయంలో రాజకీయాల్లోకి రావాలనే లక్ష్యంతో నలుగురు యువతులు తనను కలవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. యువత రాజకీయాల్లోకి రావడం సమాజానికి అవసరమని, వారి ప్రయాణంలో తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
ఈ నలుగురు విద్యార్థినుల్లో లండన్‌లోని కింగ్స్ కాలేజీలో పాలిటిక్స్, ఎకనామిక్స్ అండ్ ఫిలాసఫీ కోర్సులో చేరనున్న సరయు, నల్సార్ లా యూనివర్సిటీ విద్యార్థిని లాస్య, సింబయాసిస్ లా స్కూల్‌లో చదువుతున్న రేవతి, సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో బీకాం అభ్యసిస్తున్న అశ్విని ఉన్నారు.
రాజకీయ వ్యవస్థ, పాలనా విధానాలు, ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో అర్థం చేసుకోవాలనే తమ ఆసక్తిని యువతులు వ్యక్తం చేయగా, కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. పార్టీ కార్యాలయంలోని తన బృందంతో కలిసి పనిచేసే అవకాశం కల్పించడంతో పాటు, అవసరమైన మార్గదర్శకత్వం మరియు మద్దతు అందిస్తామని చెప్పారు.
అనంతరం కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, రాజకీయాలపై ఆసక్తితో తనను కలిసిన ఈ యువతులను చూసి ఆశ్చర్యంతో పాటు ఆనందం కలిగిందన్నారు. జెన్-జీ యువతలో కనిపిస్తున్న ఆత్మవిశ్వాసం, సామాజిక బాధ్యత పట్ల ఉన్న చైతన్యం భవిష్యత్తుపై కొత్త ఆశలను కలిగిస్తోందని వ్యాఖ్యానించారు.
కేటీఆర్‌తో జరిగిన సమావేశం తమకు ఎంతో ప్రేరణనిచ్చిందని యువతులు తెలిపారు. రాజకీయాల్లోకి కొత్త తరం రావడం ద్వారానే సమాజంలో సానుకూల మార్పులు సాధ్యమవుతాయని వారు అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ప్రజా జీవితంలో చురుకైన పాత్ర పోషించాలని తాము సంకల్పించుకున్నట్లు పేర్కొన్నారు. యువతుల ఆలోచనలు, వారి సామాజిక నిబద్ధత తనను ఆకట్టుకున్నాయని, వారు భవిష్యత్తులో సమర్థ నాయకులుగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు.
Four Gen-Z Students Visit KTR, Aspire to Enter Politics
