హైదరాబాద్: నగర ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా MMTS సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం శాసనసభ మండలి హాల్లో MMTS సేవలపై జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ మేరకు కీలక సూచనలు చేశారు.
Thank you for reading this post, don't forget to subscribe!
ఇటీవలి కాలంలో MMTSలో ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పట్టడంపై CM ఆరా తీశారు. కార్యాలయ సమయాల్లో రైళ్ల సంఖ్యను పెంచడం, సర్వీసులను సమయపాలనతో నడపడం అత్యవసరమని స్పష్టం చేశారు. ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
MMTS స్టేషన్లకు చేరుకునే విషయంలో లాస్ట్ మైల్ కనెక్టివిటీ లోపాలను సీఎం ప్రస్తావించారు. అనేక స్టేషన్లు లోపలికి ఉండటం వల్ల ఆర్టీసీ బస్సులు నేరుగా వెళ్లలేని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. దీనికి పరిష్కారంగా మినీ బస్సులు లేదా షటిల్ సేవలను ప్రవేశపెట్టే అవకాశాన్ని పరిశీలించాలని సూచించారు.
స్టేషన్లలో ప్రయాణికులకు అవసరమైన ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని CM స్పష్టం చేశారు. పరిశుభ్రత, భద్రత, తాగునీరు, పార్కింగ్ వంటి అంశాల్లో మెరుగులు తీసుకురావాలని తెలిపారు. మెరుగైన వసతులు ఉంటేనే ప్రజలు ఎంఎంటీఎస్ వైపు ఆకర్షితులవుతారని అన్నారు.
అదేవిధంగా, MMTS వ్యవస్థ స్వీయ ఆదాయ వనరులను పెంపొందించుకునే దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ప్రకటనలు, కమర్షియల్ వినియోగాలు వంటి మార్గాలను అన్వేషించాలని అధికారులకు ఆదేశించారు.
లాస్ట్ మైల్ కనెక్టివిటీ, ప్రయాణికుల సంఖ్య పెంపు, సౌకర్యాల అభివృద్ధి వంటి అంశాలపై సమగ్ర అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని అధికారులను CM ఆదేశించారు.
ఈ సమీక్షలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, ఎంఏయూడీ ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్, ఆర్ అండ్ బీ శాఖకు చెందిన వికాస్ రాజ్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, కార్యదర్శి మాణిక్ రాజ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, హెచ్ఎంఎంటీఏ ఎండీ జీవన్ బాబు, దక్షిణ మధ్య రైల్వే ప్రతినిధులు పాల్గొన్నారు.
