హైదరాబాద్‌లో రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నగర ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టేందుకు Police శాఖ మరియు GHMC అధికారులు సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు. గురువారం బషీర్‌బాగ్‌లోని పాత పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ ఐపీఎస్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ ఐఏఎస్ ఆధ్వర్యంలో కీలక కన్వర్జెన్స్ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో వర్షాకాలానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. వర్షాలు ప్రారంభమైన తర్వాత కాకుండా, ఇప్పటి నుంచే యుద్ధప్రాతిపదికన డ్రైనేజీ పూడికతీత, పైప్‌లైన్ మరమ్మతులు చేపట్టాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నగరంలో గుర్తించిన టాప్ 10 వాటర్‌లాగింగ్ పాయింట్ల వద్ద వెంటనే పనులు ప్రారంభించి శాశ్వత పరిష్కారం అందించాలని సూచించారు.
అదేవిధంగా, ప్రజల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకుని తెరిచి ఉన్న మ్యాన్‌హోల్స్‌కు పటిష్టమైన మూతలు ఏర్పాటు చేయాలని తెలిపారు. పాదచారుల సౌకర్యార్థం ఫుట్‌పాత్‌లపై ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని, రాత్రి వేళల్లో భద్రత కోసం స్ట్రీట్ లైట్లు సరిగా పనిచేసేలా చూడాలని ఆదేశించారు.
రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు రహదారుల్లోని ఇంజనీరింగ్ లోపాలను సరిచేయడం, నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్లు మరియు అండర్‌పాస్‌ల వద్ద ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు పేర్కొన్నారు.
జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ మాట్లాడుతూ, వర్షాకాలంలో ప్రజలకు ఆస్తి, ప్రాణ నష్టం కలగకుండా చూడటం అధికారుల ప్రధాన బాధ్యత అని తెలిపారు. నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం మరియు రహదారుల అభివృద్ధికి ప్రత్యేకంగా రూ.150 కోట్ల నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. ప్రతి జోన్‌కు రూ.25 కోట్ల చొప్పున ఈ నిధులను వినియోగించనున్నట్లు వివరించారు.
పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ, ఇలాంటి సమన్వయ సమావేశాల ద్వారా క్షేత్రస్థాయి సమస్యలను వేగంగా పరిష్కరించవచ్చని, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ మరియు పాదచారుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో ట్రాఫిక్ జాయింట్ సీపీ డి. జోయల్ డేవిస్, పలువురు డీసీపీలు, జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్లు మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
