‘ఓ.! సుకుమారి’లో నా దామిని పాత్ర కొత్తగా ఉంటుంది: ఐశ్వర్య రాజేష్
“‘ఓ.! సుకుమారి’లో నేను చేసిన దామిని పాత్ర ప్రేక్షకులకు పూర్తిగా కొత్త అనుభూతిని ఇస్తుంది. ఇది క్యూట్ విలేజ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. మంచి ఫన్, ఎమోషన్, కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తుంది” అని హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ అన్నారు.
యంగ్ హీరో తిరువీర్, ట్యాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన విలేజ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఓ.! సుకుమారి’. నూతన దర్శకుడు భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘శివం భజే’ తర్వాత ఈ బ్యానర్ నుంచి వస్తున్న రెండో చిత్రం ఇది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, పాటలు, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. జూలై 17న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మీడియాతో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
‘ఓ.! సుకుమారి’లోకి ఎలా వచ్చారు?
మొదట నిర్మాత మహేశ్వర్ రెడ్డి గారు నన్ను సంప్రదించారు. దర్శకుడు భరత్ దర్శన్ కథ చెప్పిన తర్వాత పూర్తి స్క్రిప్ట్ చదివాను. కాన్సెప్ట్ చాలా కొత్తగా అనిపించింది. అందుకే వెంటనే ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను.
దామిని పాత్ర ప్రత్యేకత ఏమిటి?
దామిని పాత్రకు చాలా యూనిక్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. నేను ముట్టుకుంటే షాక్ కొడతానని చెబుతుంటాను (నవ్వుతూ). అది కథలో చాలా ఆసక్తికరమైన అంశం. ఇది పూర్తిగా దామిని జర్నీ చుట్టూ తిరిగే కథ. ప్రేక్షకులు ఆ పాత్రను ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.
కొత్త దర్శకులతో పని చేయడం ఎలా ఉంటుంది?
మనందరం ఒకప్పుడు కొత్తవాళ్లమే. నేను ఇప్పటివరకు ఎక్కువగా కొత్త దర్శకులతోనే పనిచేశాను. దర్శకుడు కథ చెప్పే విధానం, ఆయన విజన్‌పై కలిగే నమ్మకమే నాకు ముఖ్యమైనది.
దర్శకత్వంపై కూడా మీకు మంచి అవగాహన ఉందా?
దర్శకత్వంపై పూర్తి పట్టు ఉందని చెప్పను. కానీ ఇన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉండటం వల్ల ప్రతి విభాగంపై కొంత అవగాహన వచ్చింది. మనకు తెలిసిన విషయాన్ని పంచుకోవడంలో, ఇతరుల అభిప్రాయాలు వినడంలో తప్పేమీ లేదని నేను నమ్ముతాను.

‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత కూడా వైవిధ్యమైన పాత్రలే ఎందుకు?
నేను తమిళంలో వరుసగా ఐదు హిట్లు ఇచ్చినప్పుడు మా ఇంటికి బొకేలు వెల్లువెత్తాయి. తర్వాత ఏడాది రెండు హిట్లు మాత్రమే వచ్చాయి. అప్పుడు బొకేలు కూడా తగ్గిపోయాయి. కానీ బొకేలు ఎక్కువ వచ్చినా, తక్కువ వచ్చినా నాలో ఎలాంటి మార్పు రాలేదు. విజయాలు, అపజయాలు సహజం. ఎప్పుడూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడమే నేర్చుకున్నాను.
సినిమాలో పొలిటికల్ టచ్ కూడా ఉందా?
తిరువీర్ ఇందులో కార్పొరేటర్ కావాలని కలలు కనే యువకుడిగా కనిపిస్తారు. ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగే ఆసక్తికర సంఘటనలు కథకు ప్రధాన బలం. నేను షాక్ కొట్టే అమ్మాయిగా కథలోకి రావడంతో పరిస్థితులు ఎలా మారతాయనేదే సినిమా. చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది.
తిరువీర్‌తో మరోసారి పనిచేయడం ఎలా అనిపించింది?
తిరువీర్ చాలా సహజమైన నటుడు. ఈ పాత్రను అద్భుతంగా చేశారు. టక్ జగదీష్ తర్వాత మళ్లీ ఆయనతో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉంది.
నిర్మాత మహేశ్వర్ రెడ్డి గురించి?
ఆయన ఎప్పుడూ కొత్త కాన్సెప్ట్‌లను ప్రోత్సహిస్తుంటారు. ఈ కథను ఎంతో నమ్మకంతో నిర్మించారు. ఈ సినిమా ఆయనకు పెద్ద విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను.
సంగీతం గురించి?
భరత్ అందించిన సంగీతం చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. పాటలు వినడానికి, చూడడానికి ఎంతో అందంగా ఉంటాయి. సినిమా మూడ్‌కు అద్భుతంగా సరిపోతాయి.
తెలంగాణ యాసలో మాట్లాడటం కష్టమా?
నేను తెలుగు అమ్మాయిని. అందుకే ఏ యాసలోనైనా మాట్లాడటం నాకు కష్టం కాదు. తెలుగు, తమిళ భాషల్లోని విభిన్న యాసల్లో నటించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
వెబ్ సిరీస్‌లపై కూడా ఫోకస్ పెంచుతున్నారు కదా?
అవును. ఏ ప్లాట్‌ఫామ్‌ను వదులుకోవాలని అనుకోవడం లేదు. వెబ్ సిరీస్‌లకు ప్రపంచవ్యాప్తంగా మంచి రీచ్ ఉంటుంది. నేను చేసిన సుడల్ వెబ్ సిరీస్‌కు అంతర్జాతీయ స్థాయిలో మంచి ఆదరణ లభించింది. ప్రస్తుతం అమెజాన్ కోసం ఒక ప్రాజెక్ట్, హాట్‌స్టార్ కోసం మరో వెబ్ సిరీస్ చేస్తున్నాను.
డిఫరెంట్ పాత్రలే చేయాలని అనుకుంటారా?
ఖచ్చితంగా. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో హీరోయిన్ కెరీర్ మూడేళ్లే అంటుండేవారు. అందుకే ఎక్కువ సినిమాలు చేయాలని అనుకునేదాన్ని (నవ్వుతూ). ఇప్పటివరకు దాదాపు 50 సినిమాలు చేశాను. నేను చేసిన ప్రతి పాత్రను ఎంతో ఇష్టపడి చేశాను.
భవిష్యత్తులో ఎలాంటి పాత్రలు చేయాలని ఉంది?
ఇప్పటివరకు ఎక్కువగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేయలేదు. నీలాంబరి తరహా పవర్‌ఫుల్ పాత్రలు, అలాగే సైకాలజికల్ ‘అబ్సెషన్’ ఉన్న పాత్రలు చేయాలని ఉంది.
ప్రేక్షకులకు మీ సందేశం?
‘ఓ.! సుకుమారి’ ఒక అందమైన విలేజ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. కొత్త కాన్సెప్ట్, వినోదం, భావోద్వేగాలు అన్నీ కలిసిన సినిమా. కుటుంబంతో కలిసి థియేటర్‌లో చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను.
