ఫ్యామిలీ థ్రిల్లర్ ‘వదలా’ జూలై 17న విడుదల
జగపతి బాబు, లయ, హృతికా శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘వదలా’ జూలై 17న గ్రాండ్ రిలీజ్
‘వెర్సటైల్ స్టార్’ జగపతి బాబు ప్రధాన పాత్రలో నటించిన ఎమోషనల్ మిస్టరీ ఫ్యామిలీ థ్రిల్లర్ ‘వదలా’ ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేయడానికి సిద్ధమైంది. ప్రముఖ దర్శకుడు అకెళ్ల వి. కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో లయ, హృతికా శ్రీనివాస్ కీలక పాత్రలు పోషించారు. చరిత చిత్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కిషోర్ నాయుడు చిరుమామిల్ల, తమ్మారెడ్డి భరద్వాజ్ నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే ఫస్ట్ గ్లింప్స్, టీజర్‌తో మంచి అంచనాలు సృష్టించగా, తాజాగా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ఈ చిత్రం జూలై 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ట్రైలర్‌ను పరిశీలిస్తే… యోగి (జగపతి బాబు) తన భార్య, ఇద్దరు పిల్లలతో ఎంతో ఆనందంగా జీవిస్తున్న కుటుంబ వ్యక్తి. పెళ్లై ఇరవై ఏళ్లు అయినా భార్యాభర్తల మధ్య ప్రేమ ఏమాత్రం తగ్గదు. అయితే పక్కింటికి వచ్చిన ఓ యువతి వారి జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి. యోగిపై ఆమెకు ప్రమాదకరమైన స్థాయిలో వ్యామోహం పెరుగుతుంది. ఇదే సమయంలో యోగి భార్యకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ రావడం, భర్తను వదిలేయాలని హెచ్చరించడం కథను ఉత్కంఠభరితంగా మారుస్తుంది.
సస్పెన్స్ థ్రిల్లర్లను తెరకెక్కించడంలో తనదైన శైలిని చాటుకున్న దర్శకుడు అకెళ్ల వి. కృష్ణ, ఈ చిత్రంలోనూ మిస్టరీ, సస్పెన్స్‌తో పాటు బలమైన కుటుంబ భావోద్వేగాలను సమర్థంగా మిళితం చేసినట్లు ట్రైలర్ స్పష్టం చేస్తోంది. మొదటి ఫ్రేమ్ నుంచి చివరి షాట్ వరకు ఉత్కంఠను కొనసాగిస్తూ ప్రేక్షకులను కథలో లీనమయ్యేలా రూపొందించారు.
జగపతి బాబు కుటుంబానికి అంకితమైన వ్యక్తి పాత్రలో మరోసారి తన సహజమైన నటనతో ఆకట్టుకోగా, లయ ఆయన భార్యగా హుందాతనంతో కూడిన భావోద్వేగ నటనను కనబరిచారు. ట్రైలర్‌లో హృతికా శ్రీనివాస్ పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బయటకు అమాయకంగా కనిపిస్తూ, లోపల ప్రమాదకరమైన మనస్తత్వంతో సస్పెన్స్‌ను పెంచే పాత్రలో ఆమె నటన ఆసక్తిని రేకెత్తిస్తోంది.
చోటా కె. నాయుడు అందించిన సినిమాటోగ్రఫీ ట్రైలర్‌కు రిచ్ విజువల్ టోన్‌ను తీసుకురాగా, కార్తీక్ కోడకండ్ల బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రతి సన్నివేశంలోని ఉత్కంఠను మరింత ఎలివేట్ చేసింది. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ ట్రైలర్‌ను మరింత గ్రిప్పింగ్‌గా మలిచింది. లక్ష్మీ భూపాల కథ అందించగా, బజ్జా బ్రహ్మయ్య ప్రొడక్షన్ డిజైన్ నిర్వహించారు. మొత్తంగా ‘వదలా’ ట్రైలర్ ఒక క్లీన్ ఫ్యామిలీ థ్రిల్లర్‌గా మంచి అంచనాలు పెంచింది.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో జగపతి బాబు మాట్లాడుతూ…
“అందరికీ నమస్కారం. ‘వదలా’ జూలై 17న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా కథపై నాకు చాలా నమ్మకం ఉంది. ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చి మంచి విజయం సాధిస్తుందని విశ్వసిస్తున్నాను. చాలా రోజుల తర్వాత పూర్తి బాధ్యత తీసుకుని ఇద్దరు హీరోయిన్లతో కలిసి ఓ ఫ్యామిలీ థ్రిల్లర్ చేశాను. ఈ సినిమా నాకు ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొస్తుందని భావిస్తున్నాను.
‘వదలా’ అనే టైటిల్ చాలా క్యాచీగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ జీవితంలో ‘వదలా’ అని అంటుంటారు. కానీ కొన్ని విషయాలు వదలకుండా పోరాడటంలోనే అసలు కిక్ ఉంటుంది. అదే ఈ సినిమా ఆత్మ.
ఈ సినిమాను 20 రోజుల క్రితమే విడుదల చేయాలనుకున్నాం. కానీ మరింత నాణ్యతతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో వాయిదా వేశాం. ఫలితం చాలా బాగా వచ్చింది. ఈ మధ్య కొంతమంది ఉద్దేశపూర్వకంగా సినిమాలను టార్గెట్ చేసి నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు. అలాంటి ధోరణి మారాలి. మంచి సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తే పరిశ్రమ బాగుంటుంది. ‘వదలా’ మంచి ఫ్యామిలీ థ్రిల్లర్. అందరూ థియేటర్‌కు వచ్చి చూసి మమ్మల్ని ఆశీర్వదించాలి.”
నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ…
“సినీ పరిశ్రమలోకి వచ్చి నాకు 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ కాలంలో ఇండస్ట్రీ పూర్తిగా మారిపోయింది. ఓటీటీ, హిందీ డబ్బింగ్, రిలీజ్ ప్లానింగ్… ఇలా ఎన్నో అంశాలను దృష్టిలో పెట్టుకుని సినిమా చేయాల్సి వస్తోంది. అయినా చివరికి ప్రేక్షకులను అలరించడమే మా లక్ష్యం.
‘వదలా’ నా కెరీర్‌లో చేసిన తొలి థ్రిల్లర్. జగపతి బాబు ఈ సినిమాను ఎంతో ప్రేమతో, ప్యాషన్‌తో చేశారు. మమ్మల్ని ఇంతకాలం ఆదరిస్తున్న ప్రేక్షకులు ఈ సినిమాను కూడా ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను.”
హీరోయిన్ లయ మాట్లాడుతూ…
“ట్రైలర్ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారు. జగపతి బాబు గారితో మళ్లీ కలిసి నటించడం సంతోషంగా ఉంది. దర్శకుడు అకెళ్ల వంశీకృష్ణ ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. చోటా కె. నాయుడు గారు నన్ను ఎంతో అందంగా చూపించారు. కార్తీక్ కోడకండ్ల అందించిన పాటలు ఇప్పటికే మంచి ఆదరణ పొందాయి. జూలై 17న ప్రేక్షకులు థియేటర్లలో ఈ సినిమాను చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను.”
హృతికా శ్రీనివాస్ మాట్లాడుతూ…
“ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. జగపతి బాబు గారు నాకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. లయ గారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. నా పాత్రకు మంచి ప్రాధాన్యం ఉంది. ప్రేక్షకులు తప్పకుండా నా నటనను ఇష్టపడతారని నమ్ముతున్నాను.”
దర్శకుడు అకెళ్ల వి. కృష్ణ మాట్లాడుతూ…
“జగపతి బాబు గారితో ‘రక్ష’ సినిమా నుంచి నా ప్రయాణం కొనసాగుతోంది. నాలుగేళ్ల క్రితం ఆయన చెప్పిన ఆలోచనే ‘వదలా’గా రూపుదిద్దుకుంది. ఈ సినిమా కోసం ఆయన అసాధారణమైన కష్టపడ్డారు. ఆయన లేకపోతే ఈ సినిమా ఈ స్థాయికి వచ్చేది కాదు.
తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఎంతో ఎనర్జిటిక్‌గా ప్రతి అంశాన్ని పర్యవేక్షించారు. చోటా కె. నాయుడు, కార్తీక్ కోడకండ్ల, లయ, హృతికా… ప్రతి ఒక్కరూ తమ బెస్ట్ ఇచ్చారు. జూలై 17న విడుదల కానున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించి పెద్ద విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను.”
నిర్మాత కిషోర్ నాయుడు చిరుమామిల్ల మాట్లాడుతూ…
“ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌కు ప్రేక్షకులు అద్భుతమైన స్పందన ఇచ్చారు. అదే ప్రేమ సినిమాకు కూడా దక్కుతుందని విశ్వసిస్తున్నాం. జూలై 17న ‘వదలా’తో పాటు విడుదలవుతున్న అన్ని సినిమాలు విజయవంతం కావాలని, తెలుగు సినిమా పరిశ్రమ మరింత అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.”
