హైదరాబాద్,
ఆషాఢ మాస బోనాల ఉత్సవాలకు చారిత్రక గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి అమ్మవారి ఆలయంలో గురువారం ఘనంగా శ్రీకారం చుట్టారు. తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రదాయ బోనం సమర్పిస్తూ మహిళలు, భక్తుల జై మహంకాళి నినాదాలతో ఆలయ పరిసరాలు భక్తిమయంగా మారాయి.
ఈ సందర్భంగా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ సజ్జనార్ ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోల్కొండ కోట అడివారం నుంచి ఆలయం వరకు భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ ఏడాది బోనాల ఉత్సవాల సందర్భంగా సుమారు 2,000 మంది పోలీసు సిబ్బందిని విధుల్లో నియమించారు. లంగర్ హౌజ్ కూడలి నుంచి గోల్కొండ ఆలయం వరకు ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. డ్రోన్లు, అత్యాధునిక సీసీ కెమెరాల ద్వారా 24 గంటల పాటు నిఘా కొనసాగుతోంది. జేబుదొంగలు, గొలుసు దొంగతనాలను అరికట్టేందుకు క్రైమ్ వింగ్ ప్రత్యేక బృందాలు అప్రమత్తంగా ఉండగా, మహిళల భద్రత కోసం షీ టీమ్స్ సేవలు అందిస్తున్నాయి.
హైదరాబాద్ నగరంలోని మొత్తం 3,427 మహంకాళి ఆలయాల్లో ఆగస్టు 13 వరకు బోనాల వేడుకలు వైభవంగా కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా ట్రాఫిక్, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, తాగునీటి సదుపాయాలు వంటి అన్ని ఏర్పాట్లను సంబంధిత శాఖలు పూర్తి చేశాయి.
ఉత్సవాల్లో నగర పోలీసులూ భక్తులతో కలిసి పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పోతరాజుల విన్యాసాల మధ్య ఓ పోలీసు అధికారి పోతరాజులతో కలిసి ఉత్సాహంగా నృత్యం చేయడం అక్కడికి వచ్చిన భక్తులను అలరించింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ పోలీసుల స్నేహపూర్వక వైఖరికి ప్రశంసలు దక్కుతున్నాయి.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని చిన్నారులు, వృద్ధులు, మహిళలు జాగ్రత్తలు పాటించాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. ప్రశాంతంగా, సురక్షితంగా బోనాల ఉత్సవాలు నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని పోలీసులు తెలిపారు.

