#RAPO23కి సామ్ సిఎస్.. రామ్ ప్రతిష్టాత్మక చిత్రానికి మ్యూజికల్ బూస్ట్
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం #RAPO23. ఈ చిత్రంతో రామ్ పోతినేని దర్శకుడిగానూ అరంగేట్రం చేస్తుండగా, రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై కృష్ణ పోతినేని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రామ్ కెరీర్‌లోనే అత్యధిక వ్యయంతో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ మరో క్రేజీ అప్డేట్‌ను ప్రకటించారు. తన పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ సంగీత దర్శకుడు సామ్ సిఎస్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఖైదీ, పుష్ప 2, మహా అవతార్ నరసింహ వంటి చిత్రాలకు అద్భుతమైన సంగీతం అందించిన సామ్ సిఎస్ ఇప్పుడు #RAPO23 టీమ్‌లో చేరడంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెరిగాయి. ముఖ్యంగా ఈ చిత్రానికి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సౌండ్ డిజైన్ ప్రధాన బలంగా నిలుస్తాయని అభిమానులు భావిస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన ఒరిజినల్ కథను స్వయంగా రామ్ పోతినేని రచించారు. నియో-నోయర్ నేపథ్యంతో రూపొందుతున్న ఈ సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్‌లో ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకులు చూడని కొత్త ప్రపంచాన్ని, విభిన్న పాత్రల ప్రయాణాన్ని ఆవిష్కరించనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.
దర్శకత్వం వహించడంతో పాటు కథానాయకుడిగానూ నటిస్తున్న రామ్ పోతినేని, తన కెరీర్‌లోనే అత్యంత సవాల్‌తో కూడిన పాత్రను ఈ చిత్రంలో పోషిస్తున్నారు. నటుడిగా, రచయితగా, దర్శకుడిగా ఆయన ఈ సినిమాతో కొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు.
సినిమాలోని కీలక పాత్రల కోసం ప్రముఖ నటీనటులను ఎంపిక చేస్తున్న చిత్రబృందం, పూర్తి తారాగణ వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించనుంది.
సాంకేతికంగా కూడా ఈ చిత్రం అత్యున్నత ప్రమాణాలతో రూపొందుతోంది. జాతీయ అవార్డు గ్రహీత సినిమాటోగ్రాఫర్ తిరునావుకరసు (తిరు) ఛాయాగ్రహణం అందిస్తుండగా, ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హైన్ యాక్షన్ సన్నివేశాలను రూపొందిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్‌గా ఏఎస్ ప్రకాశ్ పనిచేస్తున్నారు.
విభిన్న కథాంశం, భారీ నిర్మాణ విలువలు, అగ్రశ్రేణి సాంకేతిక నిపుణుల కలయికతో రూపొందుతున్న #RAPO23 రామ్ పోతినేని కెరీర్‌లోనే ఒక మైలురాయి చిత్రంగా నిలవడమే కాకుండా, తెలుగు సినీ ప్రేక్షకులకు సరికొత్త సినీ అనుభూతిని అందించనున్న చిత్రంగా నిలుస్తుందని మేకర్స్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
