Andhra Pradesh: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ శనివారం విస్తృతంగా పర్యటించారు. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈసారి మారుమూల గిరిజన గ్రామాల్లో నిర్వహిస్తూ, గిరి పుత్రుల మధ్య పార్టీ
జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ కళ్యాణం శివశ్రీనివాసరావు, రాష్ట్ర జానపద కళలు సృజనాత్మక అకాడమీ ఛైర్మన్ శ్రీ వంపూరి గంగులయ్య తదితరులు పాల్గొన్నారు.
పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ ఓనూరు, నందిగరువు, వర్థనపల్లి తదితర గిరిజన గ్రామాలను సందర్శించారు. గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాడేరు సమీపంలోని వర్థనపల్లి గ్రామంలో అంతర్గత రహదారులు, డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించిన ఆయన, మ్యాజిక్ డ్రెయిన్ల నిర్మాణానికి ఉన్న అవకాశాలను అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామస్తుల అభ్యర్థన మేరకు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి హామీ ఇచ్చారు. అలాగే స్థానిక శివాలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఓనూరు కూడలి వద్ద జనసేన పార్టీ జెండా స్థూపాన్ని ఆవిష్కరించి పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పీఎం జన్‌మన్ (అడవితల్లి బాట) పథకం కింద ఓనూరు నుంచి నందిగరువు వరకు నిర్మించిన 2.4 కిలోమీటర్ల నూతన రహదారిని కాలినడకన పరిశీలించారు. రూ.1.70 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ రహదారి పనుల నాణ్యతపై అధికారులను అభినందించారు. రహదారి నిర్మాణంలో భాగంగా ఎనిమిది కల్వర్టులు నిర్మించినట్టు అధికారులు వివరించారు.
జల్ జీవన్ మిషన్ పథకం కింద గ్రామాల్లో ఏర్పాటు చేసిన తాగునీటి సదుపాయాలను కూడా పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ఓనూరు గ్రామంలో కుళాయిల ద్వారా అందుతున్న నీటి నాణ్యతను స్వయంగా బిందెలో నీరు తీసి పరిశీలించారు. గ్రామస్తులకు తగినంత తాగునీరు అందుతున్నదా అని ప్రశ్నించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి తాగునీటి పథకానికి నిధులు అందించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీకు కృతజ్ఞతలు తెలిపారు.
పర్యటనలో భాగంగా ఓనూరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం మరియు మండల ప్రాథమిక పాఠశాలను సందర్శించిన ఆయన విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాల భవనంలో దెబ్బతిన్న ఫ్లోరింగ్‌ను మరమ్మతు చేయాలని అధికారులకు ఆదేశించారు. విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు మరియు స్టేషనరీ కిట్లను అందజేశారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు స్వీట్లు, పోషకాహార కిట్లు పంపిణీ చేశారు.
నందిగరువు గ్రామంలో నిర్వహించిన “మాటా – మంతి” కార్యక్రమంలో గిరిజనులతో మమేకమైన పవన్ కళ్యాణ్ వారి సమస్యలను ప్రత్యక్షంగా విన్నారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. నందిగరువు గ్రామంలో ప్రాథమిక పాఠశాల మరియు అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే ఓనూరు–కొత్తపలం రహదారికి అనుమతులు మంజూరు చేశారు. నర్తనపల్లి, ఓనూరు గ్రామాల్లో మ్యాజిక్ డ్రెయిన్ల నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “కూటమి ప్రభుత్వం పీపుల్ ఫ్రెండ్లీ ప్రభుత్వం. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ఎప్పుడూ ముందుంటుంది. గిరిజన గ్రామాల్లో అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నాం. గత ప్రభుత్వంలో నిధుల మళ్లింపుల కారణంగా ఏజెన్సీ ప్రాంతాలు వెనుకబడ్డాయి. అయితే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే గిరిశిఖర గ్రామాల్లో 460 కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మించాం” అని తెలిపారు.
అదేవిధంగా గిరిజన గ్రామాల్లో తాగునీరు, రహదారులు, పాఠశాల భవనాల నిర్మాణం వంటి అభివృద్ధి కార్యక్రమాలను త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. గిరిజనుల ఆదాయం పెంచేలా పండ్ల మొక్కలు నాటడం, ఎకో టూరిజం అభివృద్ధి చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
పాడేరు పర్యటనలో పవన్ కళ్యాణ్‌కు గిరిజనులు ఘన స్వాగతం పలికారు. సంప్రదాయ థింసా నృత్యంతో ఆయనను ఆహ్వానించారు. గ్రామాల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కోరుతూ వినతిపత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ అమిత్ బర్దార్, పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ, ఐటిడిఏ పీవో వెంకటేశ్వరరావు తదితర అధికారులు పాల్గొన్నారు.
