హైదరాబాద్, మార్చి 28, 2026:
సైఫాబాద్ పోలీసులు వేగవంతమైన చర్యలు తీసుకుని కేవలం 30 నిమిషాల్లో రూ.4 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, నగదును రికవరీ చేసి మరోసారి తమ పనితీరును నిరూపించారు.
తమిళనాడు రాష్ట్రానికి చెందిన మణిమేగల (భర్త: దొరస్వామి శెట్టి) ఈ నెల 27వ తేదీ రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో లక్డీకాపూల్ మెట్రో స్టేషన్ బస్‌స్టాప్ వద్ద రాపిడో ఆటోలో ప్రయాణించి దిగిన సమయంలో, తన హ్యాండ్‌బ్యాగ్‌ను పొరపాటున ఆటోలోనే వదిలి వెళ్లారు. ఆ బ్యాగులో 25 గ్రాముల బంగారు గాజులు, 2 గ్రాముల బంగారు కమ్మలు, రూ.30,000 నగదు, అలాగే ముఖ్యమైన పత్రాలు ఉన్నాయి. మొత్తం విలువ సుమారు రూ.4 లక్షలుగా అంచనా.
బ్యాగ్ పోయిన విషయం తెలుసుకున్న వెంటనే బాధితురాలు సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే స్పందించిన స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎ. సీతయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక క్రైమ్ టీమ్‌ను రంగంలోకి దించారు. హెడ్ కానిస్టేబుల్ డి. ప్రసాద్ రాజు, పోలీస్ కానిస్టేబుల్ వి. సురేష్ గౌడ్లతో కూడిన బృందం సాంకేతిక ఆధారాలు, రాపిడో యాప్ వివరాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించింది.
త్వరితగతిన చర్యలు తీసుకున్న పోలీసులు, ఆటో డ్రైవర్‌ను చాదర్‌ఘాట్ పరిధిలో గుర్తించి అక్కడికే చేరుకుని హ్యాండ్‌బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం డ్రైవర్‌ను మరియు రికవరీ చేసిన సొత్తును సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
పోలీసులు సొత్తును పరిశీలించగా నగదు, బంగారు ఆభరణాలు అన్నీ సురక్షితంగా ఉన్నట్లు నిర్ధారించారు. అనంతరం SHO ఎ. సీతయ్య స్వయంగా బాధితురాలికి ఆ సొత్తును అప్పగించారు.
ఈ మొత్తం ఆపరేషన్ కేవలం 30 నిమిషాల్లో పూర్తి కావడం విశేషం. పోలీసుల అప్రమత్తత, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, వేగవంతమైన చర్యల వల్లే ఈ విజయవంతమైన రికవరీ సాధ్యమైందని అధికారులు తెలిపారు.
తన విలువైన సొత్తు తిరిగి లభించడంతో బాధితురాలు సైఫాబాద్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల భద్రతకు అంకితభావంతో పనిచేస్తున్న హైదరాబాద్ పోలీసుల పనితీరుకు ఇది మంచి ఉదాహరణగా నిలిచింది.
Saifabad Police Recovers 4 Lakh Valuables in 30 Minutes
