హైదరాబాద్ నగరంలో ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి స్వలాభం కోసం ఆహార పదార్థాల్లో కల్తీకి పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనర్ హెచ్చరించారు. కల్తీ అనేది కేవలం వ్యాపార ఉల్లంఘన మాత్రమే కాకుండా సమాజంపై జరుగుతున్న తీవ్రమైన దాడి అని ఆయన పేర్కొన్నారు.
గురువారం బషీర్‌బాగ్‌లోని పాత పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ‘H-fast’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ల అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి మాంసం, పాలు, బేకరీ ఉత్పత్తులు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, టీ పొడి వంటి విభాగాలకు చెందిన సుమారు 200 మంది వ్యాపార ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, గత నెల రోజుల్లో నగరవ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో 92 కేసులు నమోదు చేసి, సుమారు 62 టన్నుల కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ అక్రమాలకు పాల్పడిన 98 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఇది సమస్య తీవ్రతను సూచిస్తుందని, భవిష్యత్తులో ఇలాంటి చర్యలు మరింత కఠినంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.
ఆహార పదార్థాల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని వ్యాపారులకు సూచించిన సజ్జనర్, బాధ్యతాయుత పౌరులుగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. కల్తీ రహిత తెలంగాణ సాధనలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, ఇందులో వ్యాపారుల పాత్ర అత్యంత కీలకమని గుర్తు చేశారు.
హైదరాబాద్‌కు అంతర్జాతీయ స్థాయిలో ఉన్న ఖ్యాతిని కాపాడటం ప్రతి వ్యాపారి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ తప్పనిసరిగా ఎఫ్‌ఎస్ఎస్ఏఐ (FSSAI) లైసెన్స్ కలిగి ఉండాలని, నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్కడైనా కల్తీ జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు తెలియజేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
నిజాయితీగా వ్యాపారం నిర్వహించే వారికి పోలీసు శాఖతో పాటు ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఆరోగ్యవంతమైన హైదరాబాద్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ సమావేశంలో వ్యాపార ప్రతినిధులు తమకు ఎదురవుతున్న సమస్యలను సీపీ దృష్టికి తీసుకురాగా, వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. పోలీసుల చొరవను అభినందించిన వ్యాపారులు, కల్తీని అరికట్టడంలో తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టాస్క్‌ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, అదనపు డీసీపీ ఏ. శ్రీనివాసరావు, వైద్య ఆరోగ్య శాఖాధికారి వెంకట్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Strict Action Against Food Adulteration – CP VC

