హైదరాబాద్:IT Corridor పరిధిలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి సింగిల్ రైడింగ్ ప్రధాన కారణమని మాదాపూర్ ట్రాఫిక్ పోలీసుల తాజా సర్వే స్పష్టం చేసింది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ ఆదేశాల మేరకు, ట్రాఫిక్ డీసీపీ రంజన్ రతన్ కుమార్ పర్యవేక్షణలో సైబర్ టవర్స్ పరిసరాల్లో మార్నింగ్ పీక్ అవర్ సమయంలో నిర్వహించిన ఈ సర్వేలో ఆశ్చర్యకర గణాంకాలు బయటపడ్డాయి.
కేవలం ఒక గంట వ్యవధిలోనే నాలుగు ప్రధాన రహదారులపై మొత్తం 10,138 మంది సింగిల్ రైడర్లు వాహనాలపై ఒంటరిగా ప్రయాణించినట్లు గుర్తించారు. అదే సమయంలో డబుల్ రైడర్లు కేవలం 3,584 మంది మాత్రమే ఉన్నారు. అంటే 6,554 మంది అదనంగా సింగిల్ రైడర్లు ఉండటం వల్ల రహదారులపై వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగి ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రమవుతోందని పోలీసులు వెల్లడించారు.
ఒక్కొక్కరు ఒక్కో వాహనంపై ప్రయాణించడం వల్ల ట్రాఫిక్ రద్దీ పెరగడమే కాకుండా వ్యక్తిగతంగా కూడా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు తెలిపారు. ప్రయాణ సమయం పెరగడం, ఇంధన ఖర్చులు అధికమవడం, ప్రమాదాల ముప్పు, శారీరక అలసట వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని పేర్కొన్నారు. అదేవిధంగా వాహనాల నుంచి వెలువడే కార్బన్ ఉద్గారాలు పర్యావరణ కాలుష్యాన్ని పెంచి ప్రజారోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇన్ని సమస్యలు తెలిసినప్పటికీ ఎక్కువ మంది సింగిల్ రైడింగ్‌కే మొగ్గు చూపడం ఆందోళనకరమని పోలీసులు అభిప్రాయపడ్డారు. ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రజల సహకారం అత్యవసరమని స్పష్టం చేశారు.
ఈ సర్వే కార్యక్రమంలో ట్రాఫిక్ ఏడీసీపీ-I హనుమంతరావు, మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్‌హెచ్‌ఓ శ్రీధర్ కుమార్, ఆర్‌ఐ శ్రీకాంత్, ఎస్ఐలు టీవీ రావు, రాములు తదితర సిబ్బంది పాల్గొన్నారు. ఐటీ ఉద్యోగులు మరియు పౌరులు తమ ప్రయాణాల్లో చిన్న మార్పులు చేసుకుంటే ట్రాఫిక్ రహిత సైబరాబాద్ సాధ్యమవుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
పోలీసుల సూచనలు:
ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు కీలక సూచనలు చేశారు. సాధ్యమైనంత వరకు రైడ్ షేరింగ్, కార్ పూలింగ్ పద్ధతులను అనుసరించాలని సూచించారు. ఒకే ప్రాంతానికి వెళ్తున్న వారు కలిసి ప్రయాణిస్తే వాహనాల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని తెలిపారు.
అలాగే మెట్రో, బస్సులు వంటి ప్రజా రవాణా సౌకర్యాలను ఎక్కువగా వినియోగించాలని సూచించారు. పీక్ అవర్స్‌లో అత్యవసరం అయితే తప్ప వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించాలని, ముందస్తు ప్రణాళికతో ప్రయాణ సమయాలను సర్దుబాటు చేసుకోవాలని తెలిపారు.
ఈ చిన్న మార్పులు అమలు చేస్తే ట్రాఫిక్ సమస్యను గణనీయంగా తగ్గించవచ్చని, ప్రజల సహకారం అత్యంత అవసరమని పోలీసులు పేర్కొన్నారు.
