Hyderabad: BRS Working President Kalvakuntla Taraka Rama Rao తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఆరు సంవత్సరాల క్రితం ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారి శరణ్యకు అందించిన సహాయం, నేడు ఆమె జీవితాన్ని మార్చేసింది. తాజాగా పదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన శరణ్య, తన ప్రాణాలను కాపాడిన కేటీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపింది.
2019లో ప్యారడైజ్ బాలంరాయ్ ప్రాంతానికి చెందిన కె. నారాయణ, రాజేశ్వరి దంపతుల కుమార్తె శరణ్య బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతోంది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్సకు సుమారు రూ.20 లక్షల ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. ఆరోగ్యశ్రీలో పేరు లేకపోవడంతో సరైన చికిత్స అందక వారం రోజుల పాటు ఆసుపత్రి చుట్టూ తిరిగారు.
ఈ క్లిష్ట సమయంలో శరణ్య చిన్నమ్మ సోషల్ మీడియా వేదిక X ద్వారా కేటీఆర్‌ను సంప్రదించారు. వెంటనే స్పందించిన కేటీఆర్ తన బృందాన్ని రంగంలోకి దింపి, అరగంటలోనే సహాయం ప్రారంభమయ్యేలా చేశారు. మరుసటి రోజు సెలవు దినం అయినప్పటికీ అధికారులను ఆసుపత్రికి పంపించి అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేయించారు.
కేటీఆర్ చొరవతో శరణ్యకు బసవతారకం ఆసుపత్రిలో పూర్తిగా ఉచితంగా చికిత్స అందింది. చిన్నారికి స్టెంట్ వేయడంతో పాటు మేజర్ సర్జరీ నిర్వహించారు. రూ.3 లక్షల ఖర్చు అయ్యే రేడియేషన్ థెరపీతో పాటు MRI వంటి అన్ని పరీక్షల ఖర్చులను కూడా కేటీఆర్ బృందం భరించింది. “మేము ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు” అని శరణ్య తల్లి రాజేశ్వరి భావోద్వేగంతో తెలిపారు.
ప్రాణాపాయం నుంచి బయటపడిన శరణ్య ఇటీవల విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో 384 మార్కులు సాధించి ఉత్తీర్ణత సాధించింది. తనను కాపాడిన వ్యక్తిని కలవాలనే కోరికతో ఆమె కుటుంబంతో కలిసి నంది నగర్‌లోని కేటీఆర్ నివాసాన్ని సందర్శించింది.
ఈ సందర్భంగా శరణ్యకు అభినందనలు తెలిపిన కేటీఆర్, ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కష్టాల్లో ఉన్నవారికి ఎప్పుడూ అండగా నిలుస్తానని మరోసారి నిరూపించారు.
Girl Who Beat Brain Tumor with KTR’s Help Meets Him After 6 Years in Gratitude