Hyderabad: తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న “రైతు డిస్కమ్” (రైతులకు ప్రత్యేక విద్యుత్ పంపిణీ సంస్థ)వ్యవస్థ రైతాంగాన్ని నట్టేట ముంచే ప్రమాదకర నిర్ణయమని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో విమర్శించారు. రైతులు కోరుకోకుండానే విద్యుత్ సంస్కరణల పేరుతో ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ నిర్ణయం వ్యవసాయ రంగానికి ఎండ్రిన్ పోసినట్టేనని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రైతు డిస్కమ్ ఏర్పాటుపై తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్సీ) ఎర్రగడ్డలో నిర్వహించిన పబ్లిక్ హియరింగ్‌లో పాల్గొన్న కవిత ప్రభుత్వం వైఖరిపై తీవ్ర ఆక్షేపణలు వ్యక్తం చేశారు.
రైతులకు మేలు చేసే నిర్ణయం అయితే ఆరు నెలలుగా ఎందుకు రహస్యంగా ఉంచారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. ఈఆర్సీ ప్రక్రియ వల్లే విషయం బయటకు వచ్చిందని, లేకపోతే ప్రభుత్వం ప్రజలకు తెలియనివ్వలేదని ఆరోపించారు. ఇంత కీలకమైన అంశంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించి అసెంబ్లీలో చర్చ జరపాల్సిందని అన్నారు. రహస్యంగా నిర్ణయాలు తీసుకోవడం వెనుక ఖచ్చితంగా దురుద్దేశం ఉందని వ్యాఖ్యానించారు.
రైతు డిస్కమ్ పేరుతో ప్రభుత్వం రైతులపై ప్రయోగాలు చేస్తోందని మండిపడ్డ కవిత, ఇప్పటికే రూ.25 వేల కోట్ల నష్టాల్లో ఉన్న డిస్కమ్‌ను కొత్త సంస్థగా ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్, లిఫ్ట్ ఇరిగేషన్‌కు అవసరమైన విద్యుత్ ఖర్చును ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని గుర్తుచేశారు. ఇప్పటికే డిస్కమ్‌లకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు భారీగా పేరుకుపోయాయని తెలిపారు. మొత్తం రూ.69 వేల కోట్ల బకాయిల్లో రూ.54 వేల కోట్లు ప్రభుత్వమే చెల్లించాల్సి ఉందని ఆమె పేర్కొన్నారు.
కొత్త రైతు డిస్కమ్‌కు 42 శాతం లోడ్ బదిలీ చేస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, అవసరమైన ఉద్యోగులను మాత్రం ఇవ్వడం లేదని కవిత ఆరోపించారు. ప్రస్తుతం డిస్కమ్‌లలో 45 వేల మంది ఉద్యోగులు ఉండగా, కొత్త సంస్థకు కేవలం 2 వేల మందినే బదిలీ చేయాలని చూస్తున్నారని చెప్పారు. దీంతో ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులు, విద్యుత్ సమస్యల పరిష్కారం నెలల తరబడి ఆలస్యం అయ్యే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. నియోజకవర్గ స్థాయిలో ఉండే రిపేర్ కేంద్రాలు తాలూకా స్థాయికి మారితే రైతులు మరింత ఇబ్బందులు పడతారని అన్నారు.
తెలంగాణలో 29 లక్షల బోర్లు ఉన్నాయని, రైతు డిస్కమ్ కారణంగా వాటి భవిష్యత్తు డోలాయమానంలో పడుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం 24 గంటల ఉచిత విద్యుత్ అందించడంలో తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమని, ఇప్పుడు అదే వ్యవస్థను బలహీనపరిచే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు.
ఈ నిర్ణయం వల్ల భవిష్యత్తులో రైతుల మోటార్లకు మీటర్లు పెట్టే అవకాశం ఉందని కూడా కవిత అనుమానం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ రంగంలో పెట్టిన షరతులను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆరోపించారు. రైతులకు అన్యాయం జరిగితే 1999 కాల్పుల ఘటనలాంటి పరిస్థితులు మళ్లీ రావచ్చని హెచ్చరించారు. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రభుత్వం రైతు డిస్కమ్ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
రైతాంగ భవిష్యత్తును ప్రభావితం చేసే ఈ అంశంపై కేవలం హైదరాబాద్‌లోనే కాకుండా తెలంగాణలోని 33 జిల్లాల్లో పబ్లిక్ హియరింగ్ నిర్వహించాలని ఈఆర్సీని కోరారు. ముందు పైలట్ ప్రాజెక్ట్ అమలు చేసి దాని ఫలితాలు పరిశీలించిన తర్వాతే ముందుకు వెళ్లాలని సూచించారు. వాయబుల్ కాని ఈ ప్రతిపాదనను ఈఆర్సీ పూర్తిగా తిరస్కరించాలని కవిత విజ్ఞప్తి చేశారు.
]
