Tuesday, July 28, 2026
HomeHyderabadHyderabad: తెలంగాణ ఇచ్చినప్పుడు ఏడ్చిన వాళ్లు ఇప్పుడు రాజకీయాలా? పవన్‌పై కవిత సెటైర్

Hyderabad: తెలంగాణ ఇచ్చినప్పుడు ఏడ్చిన వాళ్లు ఇప్పుడు రాజకీయాలా? పవన్‌పై కవిత సెటైర్

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు, అమరవీరుల త్యాగాల పరిరక్షణ కోసం అవసరమైతే మరోసారి పోరాటాలకు సిద్ధమవుతామని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. బంజారాహిల్స్‌లో నిర్వహించిన “తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు – సాధన” రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె ముగింపు ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రా రాజకీయ పార్టీలపై, ముఖ్యంగా పవన్ కళ్యాణ్, టీడీపీ, వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఆంధ్రా రాజకీయ నాయకులు తెలంగాణ అస్తిత్వంపై […]

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు, అమరవీరుల త్యాగాల పరిరక్షణ కోసం అవసరమైతే మరోసారి పోరాటాలకు సిద్ధమవుతామని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. బంజారాహిల్స్‌లో నిర్వహించిన “తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు – సాధన” రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె ముగింపు ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రా రాజకీయ పార్టీలపై, ముఖ్యంగా పవన్ కళ్యాణ్, టీడీపీ, వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఆంధ్రా రాజకీయ నాయకులు తెలంగాణ అస్తిత్వంపై దాడి చేసే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని కవిత ఆరోపించారు. తెలంగాణలో ఆంధ్రా నేతల విగ్రహాలు ఏర్పాటు చేస్తూ ఆధిపత్యం ప్రదర్శించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. “మా నాయకులైన పీవీ నరసింహారావు, ప్రొఫెసర్ జయశంకర్ సార్, చెన్నారెడ్డి, తెలంగాణ అమరవీరుల విగ్రహాలు ఆంధ్రాలో పెడతారా?” అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు సహనంతో ఉన్నారని, దాన్ని బలహీనతగా భావించి తెలంగాణపై పెత్తనం చేయాలనుకుంటే సహించబోమని హెచ్చరించారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో బహిరంగ సభ నిర్వహించాలనుకోవడంపై కూడా కవిత తీవ్రంగా స్పందించారు. తెలంగాణ ఏర్పడినప్పుడు 11 రోజులు పస్తులు ఉన్నానని చెప్పిన వ్యక్తికి తెలంగాణపై ప్రేమ ఎలా ఉంటుందని ప్రశ్నించారు. “సినిమా యాక్టర్‌గా సభ పెట్టుకోవచ్చు. కానీ తెలంగాణలో రాజకీయాలు చేస్తామంటే ప్రజలు ఒక్క ఓటు కూడా వేయరు” అని వ్యాఖ్యానించారు. టీడీపీ, జనసేన, వైసీపీలు తెలంగాణ నీళ్లను దోచుకోవడమే తప్ప సమాన హక్కుల కోసం ఎప్పుడూ పోరాడలేదని విమర్శించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రా రాజకీయ నాయకుల ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారని కవిత ఆరోపించారు. తెలంగాణపై మళ్లీ కుట్రలు ప్రారంభమయ్యాయని, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే బాధ్యత తమపై ఉందన్నారు. ఆంధ్రాలో రాజధాని నిర్మాణం చేయలేక ప్రజల దృష్టి మళ్లించేందుకు తెలంగాణపై రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. “రాజధాని అంటే కొన్ని ప్రభుత్వ భవనాలు కడితే సరిపోతుంది. కానీ 80 వేల ఎకరాలు సేకరించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు” అని మండిపడ్డారు. అవసరమైతే ఆంధ్రా రైతుల హక్కుల కోసం కూడా తాము పోరాడతామని చెప్పారు.

తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కవిత డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఉద్యమకారులకు 250 గజాల భూమి కేటాయింపుపై జూన్ 2న ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. లేకపోతే జూలై 2న ఉప్పల్ భగాయత్‌లోని 350 ఎకరాల ప్రభుత్వ భూమిని లక్షలాది ఉద్యమకారులతో కలిసి స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. “ఎన్నిరోజులైనా అక్కడే కూర్చుంటాం. ఉద్యమకారులందరికీ భూములు ఇవ్వాల్సిందే” అని స్పష్టం చేశారు.

తెలంగాణ ఉద్యమ చరిత్రను యువతకు తెలియజేయాల్సిన అవసరం ఉందని కవిత అన్నారు. 1969 ఉద్యమం ఇద్దరు యువకుల ప్రాణత్యాగంతో ప్రారంభమైందని, తర్వాత 369 మంది అమరులయ్యారని గుర్తు చేశారు. తొలి, మలి దశ ఉద్యమాల్లో ప్రజలు ఎంతో స్పష్టతతో పాల్గొన్నారని చెప్పారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అమరవీరుల కుటుంబాలకు స్వతంత్ర సమరయోధుల హోదా ఇవ్వాలని, తాము అధికారంలోకి వస్తే రూ. కోటి సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ అస్తిత్వం, హక్కుల పరిరక్షణ కోసం పోరాటం కొనసాగుతుందని కవిత స్పష్టం చేశారు.

Related Articles

FOLLOW US

8,022FansLike
3,456FollowersFollow
6,541FollowersFollow
5,034FollowersFollow

Latest Articles

Categories