Thursday, May 28, 2026
HomeTelangana & APఅమీన్‌పూర్‌లో వరుస చోరీలకు తెరదించిన పోలీసులు.. 45 తులాల బంగారం బాధితులకు అప్పగింత

అమీన్‌పూర్‌లో వరుస చోరీలకు తెరదించిన పోలీసులు.. 45 తులాల బంగారం బాధితులకు అప్పగింత

హైదరాబాద్: అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస ఇంటి చోరీలకు పాల్పడుతున్న సీరియల్ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న సుమారు 45 తులాల బంగారు ఆభరణాలను కోర్టు అనుమతితో బాధితులకు పోలీసులు అప్పగించారు. పోలీసుల వివరాల ప్రకారం, మండల్లా శివ అలియాస్ ఎర్ర శివ (32) అనే వ్యక్తి అమీన్‌పూర్, బందం కొమ్ము ప్రాంతాల్లో అర్థరాత్రి సమయంలో తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు […]

హైదరాబాద్: అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస ఇంటి చోరీలకు పాల్పడుతున్న సీరియల్ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న సుమారు 45 తులాల బంగారు ఆభరణాలను కోర్టు అనుమతితో బాధితులకు పోలీసులు అప్పగించారు.

పోలీసుల వివరాల ప్రకారం, మండల్లా శివ అలియాస్ ఎర్ర శివ (32) అనే వ్యక్తి అమీన్‌పూర్, బందం కొమ్ము ప్రాంతాల్లో అర్థరాత్రి సమయంలో తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నాడు. ఇళ్లలోకి రాడ్ సహాయంతో చొరబడి బీరువాల తాళాలు పగులగొట్టి బంగారు, డైమండ్ ఆభరణాలను దొంగతనం చేసినట్లు విచారణలో తేలింది. ఈ ఏడాది ఏప్రిల్ నెల రెండో వారంలో అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మూడు చోరీ ఘటనల్లో ఇతని ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

నిందితుడు ప్రస్తుతం మీర్‌పేట్‌లోని భూపేష్ గుప్తా కాలనీలో నివసిస్తుండగా, స్వస్థలం నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం రామ్ నాయక్ తండాగా పోలీసులు తెలిపారు. సుమారు 18 ఏళ్ల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చిన శివ తాపీ మేస్త్రి వద్ద కూలీ పనులు చేసేవాడని, జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు.

నిందితుడిపై మల్కాజిగిరి, సైబరాబాద్ కమిషనరేట్లు మరియు నాగర్‌కర్నూల్ జిల్లాల్లో మొత్తం 24 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. వీటిలో మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో 12 కేసులు, సైబరాబాద్ పరిధిలో 3 కేసులు, నాగర్‌కర్నూల్ జిల్లాలో 9 కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. గతంలో హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో చర్లపల్లి జైలులో శిక్ష అనుభవించి బెయిల్‌పై విడుదలైన తర్వాత మళ్లీ చోరీలకు పాల్పడినట్లు వెల్లడించారు.

ఈ కేసులో నిందితుడిని 16 మే 2026న అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. దర్యాప్తులో స్వాధీనం చేసుకున్న సుమారు 45 తులాల బంగారు ఆభరణాలను కోర్టు అనుమతితో శుక్రవారం మీడియా సమక్షంలో రామచంద్రపురం ACP Ch. Y. శ్రీనివాస్ కుమార్ బాధితులు వెంకటరమణ, భవానీ దంపతులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో అమీన్‌పూర్ ఇన్‌స్పెక్టర్ పి. నరేష్, క్రైమ్ ఇన్‌స్పెక్టర్ జి. సత్యనారాయణతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

FOLLOW US

8,022FansLike
3,456FollowersFollow
6,541FollowersFollow
5,034FollowersFollow

Latest Articles

Categories