హైదరాబాద్, ఏప్రిల్ 1:
తెలంగాణ వ్యాప్తంగా చికెన్ రిటైల్ వ్యాపారులు నిరవధిక సమ్మెకు దిగారు. బుధవారం (ఏప్రిల్ 1) నుంచి ప్రారంభమైన ఈ బంద్‌లో రాష్ట్రంలోని వేలాది చికెన్ షాపులు మూతపడ్డాయి. హైదరాబాద్ నగరంలోనే సుమారు 50 వేల వరకు చికెన్ దుకాణాలు ఈ సమ్మెలో పాల్గొంటున్నట్లు వ్యాపార సంఘాలు వెల్లడించాయి.
చికెన్ విక్రేతలు తమ లాభాలు గణనీయంగా తగ్గిపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. పెద్ద పౌల్ట్రీ ఇంటిగ్రేటర్ కంపెనీలు మార్కెట్ ధరలను నియంత్రిస్తూ రిటైల్ వ్యాపారులకు తక్కువ మార్జిన్ మాత్రమే మిగుల్చుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. గతంలో కిలోకు రూ.25 నుంచి రూ.30 వరకు లాభం వచ్చేదని, ప్రస్తుతం అది రూ.5 నుంచి రూ.10 మధ్యకే పడిపోయిందని పంజాగుట్ట చెందిన చికెన్ వ్యాపారి రవి తెలిపారు.
ఇక మరో వ్యాపారి మాట్లాడుతూ, “అద్దెలు, రవాణా ఖర్చులు, కార్మికుల వేతనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కానీ ఆదాయం మాత్రం తగ్గిపోవడంతో వ్యాపారం కొనసాగించడం కష్టంగా మారింది. కుటుంబ పోషణ కూడా సవాలుగా మారింది” అని ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యాపారులు తమ దుకాణాల ముందు ‘ఏప్రిల్ 1 నుంచి నిరవధిక బంద్’ అంటూ బోర్డులు ఏర్పాటు చేసి వినియోగదారులకు ముందస్తు సమాచారం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ యజమానుల సంఘం అధ్యక్షుడు సతీష్ గౌడ్ మాట్లాడుతూ, “పౌల్ట్రీ ఇంటిగ్రేటర్ సంస్థలు రిటైల్ మార్కెట్ ధరలను నియంత్రిస్తూ మా లాభాలను తగ్గిస్తున్నాయి. పోటీ తీవ్రంగా ఉండటంతో ధరలను పెంచలేకపోతున్నాం. ఒకరు పెంచితే కస్టమర్లు మరొక షాపుకి వెళ్లిపోతారు. అందుకే సమ్మె తప్ప మాకు మరో మార్గం లేదు” అని స్పష్టం చేశారు.
ఈ సమ్మెతో మార్కెట్‌లో చికెన్ సరఫరాపై ప్రభావం పడే అవకాశముంది. వినియోగదారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని సమస్యకు పరిష్కారం చూపాలని వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు.
