హైదరాబాద్: జూన్ 2: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి చేసిన ప్రసంగం రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం,
ప్రజాస్వామ్య పరిపాలనపై ప్రభుత్వ దిశను స్పష్టంగా ప్రతిబింబించింది. తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరులకు నివాళులర్పించిన సీఎం, రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేసిన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
“ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం” అని స్పష్టం చేసిన సీఎం, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం సమపాళ్లలో ముందుకు తీసుకెళ్తోందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగుతోందని, ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని అధికారంగా కాకుండా బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు. “ప్రభుత్వం అంటే నలుగురు చేతుల్లో పెత్తనం కాదు… నాలుగు కోట్ల ప్రజల ఉమ్మడి ప్రతినిధి” అని సీఎం వ్యాఖ్యానించారు.
రైతు సంక్షేమం ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకుందని సీఎం వివరించారు. రైతులను అప్పుల భారంనుంచి బయటపడేసేందుకు రూ.2 లక్షల వరకు పంట రుణమాఫీ చేసి దాదాపు 25 లక్షల మంది రైతులకు ఉపశమనం కల్పించామని తెలిపారు. రైతుభరోసా, ధాన్యం కొనుగోళ్లు, సాగునీటి ప్రాజెక్టులు, ఉచిత విద్యుత్ వంటి పథకాల ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తున్నామని చెప్పారు. 2025-26 అంచనాల ప్రకారం రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 236.87 లక్షల మెట్రిక్ టన్నులకు చేరిందని పేర్కొన్నారు. యాసంగి సీజన్‌లో దేశవ్యాప్తంగా సేకరించిన మొత్తం ధాన్యంలో తెలంగాణ వాటా 60 శాతంగా నమోదైందని గర్వంగా వెల్లడించారు.
మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపడుతోందని సీఎం తెలిపారు. మహిళా సంఘాలకు భారీ స్థాయిలో వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని, మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోందన్నా
రు. మహిళా సంఘాలకు రూ.లక్ష కోట్ల రుణాల లక్ష్యంతో కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు వేల కోట్ల రూపాయలు ఆదా చేసుకున్నారని తెలిపారు.
యువతకు ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టామని సీఎం పేర్కొన్నారు. గ్రూప్-1 నుంచి మెగా డీఎస్సీ వరకు వరుసగా నియామకాలు నిర్వహించి 67 వేలకుపైగా పోస్టులను భర్తీ చేశామని వెల్లడించారు. ఉద్యోగ నియామక వ్యవస్థలో పారదర్శకతను పునరుద్ధరించామని, టీజీపీఎస్సీతో పాటు నియామక సంస్థల్లో సంస్కరణలు తీసుకొచ్చామని తెలిపారు.
విద్యా రంగంలో కూడా విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని సీఎం అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధి, స్కిల్ యూనివర్సిటీలు, ప్రీ ప్రైమరీ తరగతులు, బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని 65 ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలలను
అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేశామని పేర్కొన్నారు.
పేదల గృహ స్వప్నాన్ని నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందన్నారు. మొదటి ఏడాదిలోనే 4.5 లక్షల ఇళ్లను మంజూరు చేసి, లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామని తెలిపారు. కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ ద్వారా పేదలకు ఆహార భద్రత కల్పిస్తున్నామని చెప్పారు.
ఈ సందర్భంగా “తెలంగాణ రైజింగ్-2047” విజన్ డాక్యుమెంట్‌పై సీఎం ప్రత్యేకంగా వివరించారు. రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని CURE – PURE – RARE మోడల్ అమలు చేస్తున్నామని తెలిపారు. CURE (Core Urban Region Economy) మోడల్ కింద హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి గ్లోబల్ సర్వీసెస్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఐటీ, ఫైనాన్స్, డిజిటల్ సర్వీసెస్, గ్లోబల్ బిజినెస్ రంగాల్లో హైదరాబాద్‌ను అంతర్జాతీయ కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు.
PURE (Peri Urban Region Economy) మోడల్ కింద ఔటర్ రింగ్ రోడ్ మరియు రీజినల్ రింగ్ రోడ్ మధ్య ప్రాంతాన్ని మాన్యుఫాక్చరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నామని సీఎం తెలిపారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, ఎకో ఇండస్ట్రియల్ పార్కులు, లాజిస్టిక్స్ కంపెనీల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తోందన్నారు. 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేపడుతున్నామని వెల్లడించారు.
RARE (Rural Agriculture Regional Economy) మోడల్ తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కేంద్రబిందువని సీఎం పేర్కొన్నారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, సాగునీటి విస్తరణ, పంటల వైవిధ్యం, వ్యవసాయ పరిశోధనల ద్వారా రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యమని వివరించారు. రైతులను వ్యవసాయ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందన్నారు.
మూసీ ప్రక్షాళన, చెరువుల పునరుద్ధరణ, మెట్రో విస్తరణ, విమానాశ్రయాల అభివృద్ధి, భారీ పెట్టుబడుల ఆకర్షణ వంటి అంశాల్లో ప్రభుత్వం దూకుడుగా ముందుకెళ్తోందని సీఎం చెప్పారు. హైదరాబాద్ మెట్రోను ప్రజల ఆస్తిగా మార్చామని, వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించేందుకు తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించామని, దాదాపు రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ ఇప్పుడు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల హబ్‌గా ఎదుగుతోందని తెలిపారు.
ప్రసంగం ముగింపులో తెలంగాణను 2034 నాటికి వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
“జై హింద్… జై తెలంగాణ” అంటూ ముఖ్యమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.
