Thursday, June 11, 2026
HomeEventsజూన్ 22న బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి సిల్వర్ జూబ్లీ ముగింపు వేడుక

జూన్ 22న బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి సిల్వర్ జూబ్లీ ముగింపు వేడుక

జూన్ 22న బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి సిల్వర్ జూబ్లీ ముగింపు వేడుక బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (బీఐఏసీహెచ్&ఆర్‌ఐ) సిల్వర్ జూబ్లీ వేడుకల ముగింపు కార్యక్రమాన్ని ఈ నెల 22వ తేదీన సాయంత్రం హైదరాబాద్ హైటెక్ సిటీలోని నోవోటెల్ హోటల్‌లో ఘనంగా నిర్వహించనున్నట్లు ఆస్పత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలో బాలకృష్ణ మాట్లాడుతూ, 2000 సంవత్సరంలో స్థాపించబడిన ఈ సంస్థ 25 సంవత్సరాల […]

జూన్ 22న బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి సిల్వర్ జూబ్లీ ముగింపు వేడుక

బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (బీఐఏసీహెచ్&ఆర్‌ఐ) సిల్వర్ జూబ్లీ వేడుకల ముగింపు కార్యక్రమాన్ని ఈ నెల 22వ తేదీన సాయంత్రం హైదరాబాద్ హైటెక్ సిటీలోని నోవోటెల్ హోటల్‌లో ఘనంగా నిర్వహించనున్నట్లు ఆస్పత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ తెలిపారు.

ఈ సందర్భంగా ఆస్పత్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలో బాలకృష్ణ మాట్లాడుతూ, 2000 సంవత్సరంలో స్థాపించబడిన ఈ సంస్థ 25 సంవత్సరాల విజయవంతమైన ప్రయాణాన్ని పూర్తి చేసుకుని మరింత విస్తృత సేవల దిశగా అడుగులు వేస్తోందన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు, శ్రీమతి బసవతారకం ఆశయాలకు అనుగుణంగా ఈ సంస్థ నడుస్తోందని, గత ఏడాది కాలంగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు.

సిల్వర్ జూబ్లీ ముగింపు వేడుకలకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జె.పి. నడ్డా, భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథులుగా హాజరవుతారని వెల్లడించారు.

అలాగే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్, తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలిపారు.

Grand Silver Jubilee Closing Ceremony Planned for Basavatarakam Cancer Hospital
Grand Silver Jubilee Closing Ceremony Planned for Basavatarakam Cancer Hospital

ఈ కార్యక్రమం ద్వారా ఆస్పత్రి 25 సంవత్సరాల సేవా ప్రస్థానాన్ని సమీక్షించుకోవడంతో పాటు భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నట్లు బాలకృష్ణ తెలిపారు. హైదరాబాద్‌లో నిర్మించనున్న నూతన నార్త్ బ్లాక్‌తో పాటు అమరావతి సమీపంలోని తుళ్లూరులో నిర్మాణంలో ఉన్న నూతన క్యాన్సర్ ఆస్పత్రి పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు.

గత 25 సంవత్సరాలుగా ఆస్పత్రి నిర్మాణం, అభివృద్ధి, సేవా కార్యక్రమాలకు సహకరించిన ప్రతి ఒక్కరిని ఈ సందర్భంగా స్మరించుకుంటామని, వారి సేవాస్ఫూర్తే సంస్థకు మార్గదర్శకమని పేర్కొన్నారు. లాభాపేక్ష లేకుండా క్యాన్సర్ బాధితులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ సంస్థ పనిచేస్తోందని, భవిష్యత్తులో కూడా అదే నిబద్ధతతో సేవలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

మీడియా సమావేశానికి ముందు ఆస్పత్రి ప్రాంగణంలో నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. క్యాన్సర్‌తో చికిత్స పొందుతున్న చిన్నారులతో కలిసి భారీ కేక్ కట్ చేసి వారికి పంచిపెట్టారు. అనంతరం చిన్నారులకు బొమ్మలు, బహుమతులు అందజేసి వారితో ఆప్యాయంగా ముచ్చటించారు.

ఈ సందర్భంగా హైదరాబాద్‌కు చెందిన సీతారామరాజు ఆస్పత్రికి రూ.1 లక్ష విరాళాన్ని అందజేశారు. అలాగే త్రివేణి, కృష్ణవేణి పాఠశాలల విద్యార్థులు, యాజమాన్యం కలిసి క్యాన్సర్ బాధితుల సహాయార్థం సేకరించిన రూ.1,01,116 విరాళాన్ని బాలకృష్ణకు అందజేశారు.

Grand Silver Jubilee Closing Ceremony Planned for Basavatarakam Cancer Hospital
Grand Silver Jubilee Closing Ceremony Planned for Basavatarakam Cancer Hospital

అమరావతి సమీపంలోని తుళ్లూరులో నిర్మాణంలో ఉన్న నూతన ఆస్పత్రి కోసం కాకర్ల రాఘవేంద్రరావు రూ.10 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా విరాళాలు అందించిన ప్రతి ఒక్కరికీ బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా చిన్నారులు చేసిన సేవా కార్యక్రమాన్ని అభినందించారు.

తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన బాలకృష్ణ, భవిష్యత్తులో మరింత ఉత్సాహంతో సమాజ సేవ చేసేందుకు భగవంతుడు తనకు శక్తిని ప్రసాదించాలని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో బీఐఏసీహెచ్&ఆర్‌ఐ మెడికల్ డైరెక్టర్ డా. టి. సుబ్రహ్మణ్యేశ్వరరావు, మెడికల్ సూపరింటెండెంట్ డా. ఫణి కోటేశ్వరరావు, అసోసియేట్ డైరెక్టర్ (అకాడమిక్స్) డా. కల్పనా రఘునాథ్, వివిధ విభాగాల వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Articles

FOLLOW US

8,022FansLike
3,456FollowersFollow
6,541FollowersFollow
5,034FollowersFollow

Latest Articles

Categories