హైదరాబాద్, జూన్ 29: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హిమాయత్ సాగర్ జలాశయానికి వరద నీటి ప్రవాహం పెరగడంతో, ఈ వర్షాకాలంలో తొలిసారిగా జలాశయ గేట్లను ఎత్తి అదనపు నీటిని విడుదల చేశారు. ఆదివారం సాయంత్రం 1,000 క్యూసెక్కుల మేర నీటిని దిగువకు వదిలినట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) వెల్లడించింది.
జలాశయంలోకి వరద ప్రవాహం నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో నీటి మట్టాన్ని నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం హిమాయత్ సాగర్‌కు వస్తున్న ఇన్‌ఫ్లోలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని, అవసరాన్ని బట్టి నీటి విడుదల పరిమాణాన్ని పెంచడం లేదా తగ్గించడం జరుగుతుందని పేర్కొన్నారు.
హైదరాబాద్ నగరానికి తాగునీటి అవసరాలను తీర్చేందుకు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల నుంచి నీటిని సరఫరా చేస్తున్న నేపథ్యంలో జలాశయ భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు వాటర్ బోర్డు వెల్లడించింది.
హిమాయత్ సాగర్ నుంచి నీటిని విడుదల చేయడంతో మూసీ నది పరీవాహక ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని వాటర్ బోర్డు, సంబంధిత శాఖలను ఆదేశించారు. ముఖ్యంగా HYDRAA, GHMC, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా యంత్రాంగాలు, పోలీసు శాఖ అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
మూసీ నది పరివాహక ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు, నదీ తీర ప్రాంతాల్లో సంచరించే వారు, చేపల వేటకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. అవసరమైతే స్థానిక అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించారు.
నీటి విడుదల కొనసాగుతున్నందున మూసీ నదిలో నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అనవసరంగా నదిలోకి దిగకూడదని, ప్రమాదకర ప్రాంతాలకు దూరంగా ఉండాలని వాటర్ బోర్డు సూచించింది.
