‘నాగబంధం’లో నా కెరీర్‌లోనే అత్యంత పవర్‌ఫుల్ పాత్ర: నభా నటేష్
హీరో విరాట్ కర్ణ ప్రధాన పాత్రలో అభిషేక్ నామా దర్శకత్వంలో రూపొందిన భారీ ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ **’నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’**పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మించిన ఈ చిత్రం జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ సందర్భంగా హీరోయిన్ నభా నటేష్ మీడియాతో మాట్లాడుతూ సినిమా విశేషాలను పంచుకున్నారు. ఈ చిత్రంలో తాను ‘పార్వతి’ అనే వేద విద్యార్థిని పాత్రలో కనిపించనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు తన కెరీర్‌లో చేయని అత్యంత బలమైన పాత్ర ఇదేనని, కథలో తన పాత్ర తీసుకునే ప్రతి నిర్ణయం కథను కీలక మలుపు తిప్పుతుందని చెప్పారు. ప్రేక్షకులు తన పాత్రను చూసి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారని నమ్మకం వ్యక్తం చేశారు.

సినిమాలోని భారీ డ్యాన్స్ నంబర్ గురించి మాట్లాడుతూ, దాదాపు 5,000 మంది డ్యాన్సర్లతో గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ చేసిన ఈ పాట విజువల్‌గా అద్భుతంగా ఉంటుందని చెప్పారు. క్లాసికల్ డ్యాన్స్‌తో పాటు భక్తి భావాన్ని ప్రతిబింబించేలా ఈ పాటను చిత్రీకరించారని, పెద్ద తెరపై ప్రేక్షకులకు ఓ ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుందని అన్నారు.
సినిమా కోసం ప్రత్యేకంగా నిర్మించిన అనంత పద్మనాభస్వామి ఆలయ సెట్ గురించి నభా మాట్లాడుతూ, ఆ సెట్‌లో అడుగుపెడితే నిజమైన ఆలయంలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుందని తెలిపారు. షూటింగ్ సమయంలో అందరూ నియమనిష్టలు పాటిస్తూ పూర్తిగా శాకాహారులుగా ఉన్నామని, ప్రతిరోజూ పూజలు నిర్వహించిన తర్వాతే చిత్రీకరణ ప్రారంభించేవారని వెల్లడించారు.

దర్శకుడు అభిషేక్ నామా గురించి మాట్లాడుతూ, ఆయనకు అద్భుతమైన విజన్ ఉందని ప్రశంసించారు. కథ చెప్పినప్పుడే తాను పూర్తిగా మెస్మరైజ్ అయ్యానని, ప్రతి సన్నివేశానికి ముందుగానే స్టోరీబోర్డ్స్ సిద్ధం చేసి ఎంతో కచ్చితత్వంతో చిత్రీకరించారని అన్నారు. ఈ సినిమా కోసం ప్రతి రోజూ తన మేకప్, కాస్ట్యూమ్స్‌కు దాదాపు రెండు గంటల సమయం పట్టేదని, అయితే అలాంటి భారీ చిత్రంలో నటించడం తనకు గొప్ప అనుభవంగా నిలిచిందని చెప్పారు.
నిర్మాతలపై ప్రశంసలు కురిపించిన నభా, తొలి సినిమానే అయినప్పటికీ దాదాపు రూ.110 కోట్ల భారీ బడ్జెట్‌తో ఎలాంటి రాజీ లేకుండా సినిమాను నిర్మించారని అన్నారు. అలాగే ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన అనంత పద్మనాభస్వామి రథయాత్రకు వస్తున్న అద్భుత స్పందన చిత్రంపై ఉన్న ఆసక్తిని మరింత పెంచిందని పేర్కొన్నారు.
హీరో విరాట్ కర్ణ గురించి మాట్లాడుతూ, ఆయనలో అపారమైన ప్యాషన్, డెడికేషన్ కనిపించిందని చెప్పారు. ఇది ఆయన రెండో సినిమా అని అనిపించదని, ఎంతో అనుభవం ఉన్న నటుడిలా నటించారని ప్రశంసించారు. అలాగే సినిమాటోగ్రాఫర్ సౌందర్ రాజన్ ప్రతి ఫ్రేమ్‌ను అద్భుతంగా తెరకెక్కించారని, ప్రేక్షకులు సినిమా విజువల్స్ చూసి తప్పకుండా ఆశ్చర్యపోతారని అన్నారు.

‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత సినిమాలు తగ్గడానికి కారణంగా తనకు జరిగిన భుజం గాయం కారణంగా దాదాపు ఏడాదిన్నర పాటు విరామం తీసుకున్నానని నభా వెల్లడించారు. పూర్తిగా కోలుకున్న తర్వాతే మళ్లీ సినిమాలు ప్రారంభించానని తెలిపారు.
అలాగే ప్రస్తుతం ‘స్వయంభూ’ వంటి మరో భారీ పాన్ ఇండియా చిత్రంలో కూడా నటిస్తున్నానని, వరుసగా రెండు భారీ చిత్రాల్లో భాగం కావడం ఒక నటిగా తనకు ఎంతో గర్వకారణమని నభా నటేష్ పేర్కొన్నారు.
