దర్శకుడిగా కిరణ్ అబ్బవరం తొలి అడుగు.. కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం
కెఏ, కే-ర్యాంప్ చిత్రాలతో వరుస విజయాలను అందుకుని టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో కిరణ్ అబ్బవరం మరో సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ‘ఎస్‌ఆర్ కళ్యాణమండపం’ సినిమాతో కథా రచయితగా తన ప్రతిభను నిరూపించుకున్న ఆయన, ఇప్పుడు దర్శకుడిగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు.
ఇప్పటివరకు టైటిల్‌ను ప్రకటించని ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం హీరోగా నటించడమే కాకుండా కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలను కూడా స్వయంగా నిర్వహిస్తున్నారు. ప్రముఖ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ చాగంటి ‘జాయ్ ఫిలిమ్స్’ బ్యానర్‌పై నిర్మాతగా పరిచయం అవుతుండగా, సురేష్ ఎర్ర సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఈ చిత్రం కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ప్రాజెక్ట్‌గా నిలవనుంది. తాజాగా విడుదలైన అనౌన్స్‌మెంట్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. పెద్ద గంగాళం, మంటలు, పొగల మధ్య గ్రామీణ నేపథ్యంలో కిరణ్ అబ్బవరం కనిపించిన తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. “Ek Dum Bindass Pakaane Waale” అనే ట్యాగ్‌లైన్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.
ఈ చిత్రంలో దేవికా భట్ కథానాయికగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ప్రముఖ నటులు శరత్‌కుమార్, సాయికుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యూత్‌ను ఆకట్టుకునే వినోదంతో పాటు బలమైన కుటుంబ భావోద్వేగాలు కలగలిపిన పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
హైదరాబాద్‌లో నేడు ఘనంగా జరిగిన పూజా కార్యక్రమంతో సినిమా అధికారికంగా ప్రారంభమైంది. పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరైన ఈ కార్యక్రమం అనంతరం రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించారు. మొదటి షెడ్యూల్‌లోనే ప్రధాన తారాగణం పాల్గొంటోంది.
సాంకేతిక విభాగంలో విశ్వాస్ డేనియల్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, వరుస విజయాలతో దూసుకుపోతున్న భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని సమకూరుస్తున్నారు. సుధీర్ మాచర్ల ఆర్ట్ డైరెక్టర్‌గా, సంతోష్ నాయుడు ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.
హీరోగా విజయవంతమైన ప్రయాణం కొనసాగిస్తున్న కిరణ్ అబ్బవరం, ఇప్పుడు దర్శకుడిగా కూడా తన ముద్ర వేయడానికి సిద్ధమవుతున్నారు. భారీ స్థాయి నిర్మాణం, బలమైన తారాగణం, కమర్షియల్ అంశాలతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లలో ఒకటిగా మారింది.

