‘రావు బహదూర్’పై మహేష్ బాబు ప్రశంసలు మరింత ధైర్యాన్నిచ్చాయి: సత్యదేవ్
మహేష్ బాబు గారు ‘రావు బహదూర్’ చూసి ‘మునుపెన్నడూ చూడని సినిమా’ అన్నారు… ఆ మాటలు మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి: ‘మోర్ దాన్ ఏ టీజర్’ లాంచ్‌లో హీరో సత్యదేవ్
టాలెంటెడ్ హీరో సత్యదేవ్, క్రియేటివ్ డైరెక్టర్ వెంకటేష్ మహా కాంబినేషన్‌లో రూపొందిన మోస్ట్ అవైటెడ్ సైకాలజికల్ డ్రామా ‘రావు బహదూర్’ విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, వినూత్న ప్రమోషన్స్, సినీ ప్రముఖుల ప్రశంసలతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. జూలై 3న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రబృందం “మోర్ దాన్ ఏ టీజర్” పేరుతో ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోకు సూపర్ స్టార్ మహేష్ బాబు అందించిన పవర్‌ఫుల్ వాయిస్ ఓవర్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. భావోద్వేగాలు, మిస్టరీ, విజువల్ గ్రాండియర్ కలగలిసిన ఈ వీడియో సినిమా కేవలం మరో థ్రిల్లర్ కాదని, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించే చిత్రమని స్పష్టం చేసింది.
“When Drama Begins, Logic Ends” అనే ప్రసిద్ధ కోట్‌తో ప్రారంభమైన వీడియోలో మహేష్ బాబు తనదైన శైలిలో “డ్రామాతో పాటు మ్యాజిక్ కలిస్తే… లాజిక్‌కు కొత్త అర్థం పుడుతుంది” అంటూ చెప్పిన డైలాగ్ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఒక చిన్న సందేహం ఎలా ఒక మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందో, అదే సందేహం ప్రపంచాన్నే తలకిందులు చేసే స్థాయికి ఎలా చేరుకుంటుందో ఆసక్తికరంగా చూపిస్తూ కథను ఎక్కడా రివీల్ చేయకుండా క్యూరియాసిటీని పెంచేలా ఈ వీడియోను రూపొందించారు. “ఇక్కడ మ్యాజిక్ అంటే గారడీ కాదు… దృశ్యకావ్యం” అంటూ మహేష్ బాబు చెప్పిన మాటలు సినిమా విజువల్ ట్రీట్‌గా ఉండబోతోందనే సంకేతాలను ఇచ్చాయి.
చివరగా “మునుపెన్నడూ చూడని విధంగా తెలుగు సినిమా… రావు బహదూర్” అంటూ మహేష్ బాబు చెప్పిన మాటలు సినిమాపై అంచనాలను మరింత పెంచాయి.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రశ్నోత్తర కార్యక్రమంలో చిత్రబృందం పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.
నిర్మాత అనురాగ్ రెడ్డి మాట్లాడుతూ…
మహేష్ బాబు గారు ఒక సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా అరుదైన విషయం. ఈ సినిమా ఎంత కొత్త తరహాలో రూపొందిందో ఆయన పూర్తిగా అర్థం చేసుకున్నారు. కొత్త కథలను ఎప్పుడూ ప్రోత్సహించే వ్యక్తి ఆయన. అందుకే ఈ సినిమాకు తన మద్దతు అందించారు.
ఇప్పటికే కొంతమందికి సినిమా ప్రదర్శించగా, చూసిన ప్రతి ఒక్కరూ “ఇలాంటి సినిమా ఇప్పటివరకు రాలేదు” అని ప్రశంసించారని తెలిపారు. కథ, మేకింగ్, నటీనటుల ప్రదర్శనలు అన్ని విధాలా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
మహేష్ బాబు సినిమా చూసిన తర్వాత దాదాపు 40 నిమిషాల పాటు సినిమా గురించే మాట్లాడారని, అదే తమకు గొప్ప విజయ సంకేతంగా అనిపించిందన్నారు.
దర్శకుడు వెంకటేష్ మహా మాట్లాడుతూ…
ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా గొప్పతనాన్ని మరో స్థాయికి తీసుకెళ్లే చిత్రంగా ‘రావు బహదూర్’ నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
‘కేరాఫ్ కంచరపాలెం’ సమయంలో కూడా ఇలాంటి సందేహాలే వచ్చాయని, కానీ మంచి కథ ఎప్పుడూ ప్రేక్షకులకు చేరుతుందనే నమ్మకం తనకు ఉందన్నారు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా ప్రతి ప్రేక్షకుడు కనెక్ట్ అయ్యేలా సినిమాలు చేయడమే తన లక్ష్యమని తెలిపారు.
మహేష్ బాబు సినిమా చూసిన తర్వాత స్వయంగా వాయిస్ ఓవర్ ఇవ్వాలని ముందుకు రావడం, “ఇలాంటి తెలుగు సినిమా నేను ఇంతకుముందు చూడలేదు” అని చెప్పడం తనకు జీవితాంతం గుర్తుండిపోయే ప్రశంస అని వెంకటేష్ మహా అన్నారు.
హీరో సత్యదేవ్ మాట్లాడుతూ…
“‘రావు బహదూర్’ తెలుగు సినిమాకు మేము రాసిన ప్రేమలేఖ. మహేష్ బాబు గారు కూడా ఇదే మాట చెప్పారు. ఇది తెలుగు సినిమాకు ఒక లవ్ లెటర్” అని సత్యదేవ్ అన్నారు.
ఈ సినిమా తర్వాత తనను ప్రేక్షకులు ‘రావు బహదూర్ సత్యదేవ్’ అని గుర్తుపెట్టుకుంటారనే నమ్మకం ఉందన్నారు. ‘జ్యోతి లక్ష్మి’ తన కెరీర్‌కు ఎలా టర్నింగ్ పాయింట్ అయిందో, అదే విధంగా ‘రావు బహదూర్’ కూడా మరో కీలక మలుపు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అలాగే దర్శకుడు వెంకటేష్ మహా ఈ చిత్రంలో ఒక ప్రత్యేక పాత్రలో కనిపిస్తారని, ఆయన పాత్ర ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుందని వెల్లడించారు.
నిర్మాత గోపాలకృష్ణ రెడ్డి మాట్లాడుతూ…
ఈ సినిమా చూసిన కొద్దీ మళ్లీ మళ్లీ చూడాలనిపించే చిత్రమని అన్నారు. మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ ఈ సినిమాను సమర్పించడం తమకు గర్వకారణమని చెప్పారు. వెంకటేష్ మహా చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని, ఈ పాత్రలో సత్యదేవ్‌ను తప్ప మరెవరినీ ఊహించలేమన్నారు. కుటుంబ సమేతంగా చూసే మ్యాజికల్ సినిమాటిక్ అనుభూతిని ఈ చిత్రం అందిస్తుందని తెలిపారు.
నిర్మాత శరత్ చంద్ర మాట్లాడుతూ…
‘రావు బహదూర్’ వంటి సినిమా ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకులు చూడలేదని అన్నారు. సినిమా క్రాఫ్ట్, కథనం, విజువల్ ట్రీట్ అన్నీ ప్రేక్షకులకు పూర్తిగా కొత్త అనుభూతిని అందిస్తాయని చెప్పారు. థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రతి ప్రేక్షకుడు ఒక ప్రత్యేకమైన సినీ అనుభూతితో బయటకు వస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
నటి దీప థామస్ మాట్లాడుతూ…
ఈ సినిమా ద్వారా తన కల నెరవేరిందని అన్నారు. అవకాశం ఇచ్చిన దర్శకుడు వెంకటేష్ మహాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ‘కేరాఫ్ కంచరపాలెం’ తనకు అత్యంత ఇష్టమైన సినిమాల్లో ఒకటని చెప్పారు. సత్యదేవ్‌తో కలిసి పనిచేయడం గొప్ప అనుభవమని, మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ సమర్పిస్తున్న సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కావడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు, సినీ ప్రముఖులు, మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
