‘నాగబంధం’ కోసం ప్రాణం పెట్టి పనిచేశా: విరాట్ కర్ణ
‘నాగబంధం’ కోసం ప్రాణం పెట్టి పనిచేశా… ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ గ్యారెంటీ: హీరో విరాట్ కర్ణ
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’ జూలై 3న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, రిషభ్ సావ్నీ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు దేశవ్యాప్తంగా అద్భుతమైన స్పందన లభించింది.
సినిమా విడుదల సందర్భంగా హీరో విరాట్ కర్ణ మీడియాతో మాట్లాడుతూ ‘నాగబంధం’ తన కెరీర్‌లో ఎంతో ప్రత్యేకమైన సినిమా అని చెప్పారు.
“ఈ సినిమా కోసం నా శక్తి మేరకు కాదు… ప్రాణం పెట్టి పనిచేశాను. షూటింగ్ సమయంలో జ్వరం వచ్చినా వెనక్కి తగ్గలేదు. ఒక్క యాక్షన్ సీన్‌కు కూడా డూప్ ఉపయోగించలేదు. ప్రతి సన్నివేశాన్ని నేనే చేశాను. ఇంత భారీ ప్రాజెక్ట్‌లో భాగం కావడం నటుడిగా నా అదృష్టంగా భావిస్తున్నాను” అని విరాట్ కర్ణ అన్నారు.

సినిమా కోసం తాను ఎంతో కష్టపడి బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ చేశానని తెలిపారు. “రుద్ర పాత్ర కోసం దాదాపు 20 కిలోలు బరువు పెరిగాను. నాగసాధు పాత్ర కోసం మళ్లీ బరువు తగ్గాను. హార్స్ రైడింగ్ నేర్చుకున్నాను. డాన్స్‌లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాను. నాగసాధు పాత్ర మేకప్‌కే రోజుకు ఆరు గంటలు పట్టేది” అని చెప్పారు.
దర్శకుడు అభిషేక్ నామా గురించి మాట్లాడుతూ, “ఈ కథ విన్న వెంటనే ఈ పాత్ర నా కోసమే రాసినట్లు అనిపించింది. షూటింగ్ సమయంలో ఎప్పుడూ ధైర్యం చెప్పి నాలో ఆత్మవిశ్వాసం నింపారు. ఆయన నన్ను ఒక మంచి నటుడిగా తీర్చిదిద్దారు” అన్నారు.
భారీ బడ్జెట్ సినిమా కావడంతో మొదట్లో కొంత ఒత్తిడి అనిపించినా, దర్శకుడు, నిర్మాతలు పూర్తి మద్దతుగా నిలిచారని చెప్పారు. “సినిమా కంటెంట్‌పై నిర్మాతలకు అపారమైన నమ్మకం ఉంది. ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. ప్రస్తుతం వస్తున్న అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే ప్రేక్షకుల ఆశీస్సులు, దేవుడి కృప మా వెంట ఉన్నాయనే నమ్మకం కలుగుతోంది” అన్నారు.

షూటింగ్‌లో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకుంటూ, “చలికాలంలో ఓ యాక్షన్ సీన్ చేస్తుండగా నా శరీరం పూర్తిగా ఫ్రీజ్ అయిపోయింది. వెంటనే ఆసుపత్రికి తరలించారు. మరుసటి రోజే మళ్లీ షూటింగ్‌లో పాల్గొన్నాను. ఈ సినిమా కోసం ఎంత అంకితభావంతో పనిచేశానో ఆ సంఘటన చెబుతుంది” అని పేర్కొన్నారు.
మెగాస్టార్ చిరంజీవి తనకు స్ఫూర్తి అని చెప్పిన విరాట్ కర్ణ, చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగానని, ఆయన పాటలకు డ్యాన్స్ చేస్తూ సినిమాలపై ఆసక్తి పెరిగిందని తెలిపారు.
హీరోయిన్ నభా నటేష్ పాత్ర గురించి మాట్లాడుతూ, “ఆమె పాత్ర సినిమాలో చాలా కీలకం. ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే ట్విస్టులు ఉంటాయి. ఆమె పాత్ర కథకు ప్రధాన బలంగా నిలుస్తుంది” అన్నారు.
చివరగా సినిమా గురించి మాట్లాడుతూ, “ఇప్పటికే సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అద్భుతమైన రిపోర్ట్ ఇస్తున్నారు. అభిషేక్ నామా గారికి మాస్ పల్స్ బాగా తెలుసు. ఆయన తెరకెక్కించిన ప్రతి సన్నివేశం నాకు గూస్‌బంప్స్ ఇచ్చింది. ‘నాగబంధం’ ప్రేక్షకులకు గొప్ప విజువల్ ట్రీట్‌తో పాటు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తుంది. ఈ సినిమాతో ప్రేక్షకుల ప్రేమను తప్పకుండా గెలుచుకుంటాననే నమ్మకం ఉంది” అని విరాట్ కర్ణ అన్నారు.

