హైదరాబాద్ నగరంలో చేపడుతున్న హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (H-CITI) ప్రాజెక్టు పనుల నేపథ్యంలో కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో ఆదివారం (జూన్ 21) ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ల పరిధిలో స్టీల్ ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వన్‌వే ట్రయల్ రన్ నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న ప్రధాన రహదారులపై ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. ఎన్‌ఎఫ్‌సీఎల్ వైపు నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, రోడ్ నెం.36, రోడ్ నెం.45, కేబుల్ బ్రిడ్జ్ వైపు వెళ్లే వాహనదారులు ఎన్టీఆర్ భవన్, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి, భారతీయ విద్యాభవన్ మార్గాన్ని వినియోగించాలని సూచించారు.
అలాగే యూసుఫ్‌గూడ, శ్రీనగర్ కాలనీ ప్రాంతాల నుంచి జూబ్లీహిల్స్, మాదాపూర్ వైపు వెళ్లే వాహనాలకు ప్రత్యేక ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేశారు. ఇందిరానగర్ గడ్డ రోడ్, వెంకటగిరి జంక్షన్, డైమండ్ హౌస్, జూబ్లీహిల్స్ రోడ్ నెం.10 మార్గాలతో పాటు అన్నపూర్ణ స్టూడియో బైలేన్, ఫిలింనగర్, షేక్‌పేట్ వైపు వెళ్లే మార్గాలను వినియోగించాలని సూచించారు.
ఐటీసీ కోహినూర్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ ప్రాంతాల నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, పంజాగుట్ట వైపు వెళ్లే వాహనాలు రోడ్ నెం.60, 67, రోడ్ నెం.1 మార్గాలను ఉపయోగించాలని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
ట్రయల్ రన్ సమయంలో ఎక్కడా యూ-టర్న్‌లకు అనుమతి ఉండదని, వాహనదారులు రోడ్డుకు ఎడమవైపు ప్రయాణిస్తూ సైన్‌బోర్డులు, ట్రాఫిక్ పోలీసుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు కోరారు. రియల్ టైమ్ ట్రాఫిక్ సమాచారం కోసం నావిగేషన్ యాప్‌లను వినియోగించాలని సూచించారు.
ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రజా రవాణా, కార్‌పూలింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని, భారీ వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ శాఖ విజ్ఞప్తి చేసింది. ప్రజల సహకారంతో ట్రాఫిక్ నిర్వహణను విజయవంతం చేయాలని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ డి. జోయల్ డేవిస్ ఐపీఎస్ కోరారు.
