NEET రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు TGSRTC ఉచిత బస్సు ప్రయాణం
హైదరాబాద్, జూన్ 19: దేశవ్యాప్తంగా ఈ నెల 21న నిర్వహించనున్న NEET Re-Exam కు హాజరయ్యే అభ్యర్థుల సౌకర్యార్థం Telangana State Road Transport Corporation (TGSRTC) ప్రత్యేక నిర్ణయం తీసుకుంది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నట్లు సంస్థ Vice Chairman and Managing Director Y. Nagi Reddy ప్రకటించారు.
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. పరీక్ష రాసే విద్యార్థులు తమ NEET Hall Ticket ను బస్సు సిబ్బందికి చూపించి, ఇంటి నుంచి పరీక్షా కేంద్రానికి వెళ్లేందుకు, పరీక్ష అనంతరం తిరిగి ఇంటికి చేరుకునేందుకు ఉచితంగా ప్రయాణించవచ్చని వెల్లడించారు.
ఈ సదుపాయం AC Services మినహా TGSRTC నిర్వహిస్తున్న అన్ని రకాల బస్సుల్లో అందుబాటులో ఉంటుందని నాగిరెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 73 వేల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్న నేపథ్యంలో, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్లు పేర్కొన్నారు.
పరీక్షా కేంద్రాలు ఉన్న మార్గాల్లో అదనపు బస్సులను నడపడంతో పాటు, అవసరమైన చోట ప్రత్యేక సర్వీసులు కూడా అందుబాటులో ఉంచనున్నట్లు ఆయన తెలిపారు. పరీక్ష రోజున విద్యార్థులు సమయానికి కేంద్రాలకు చేరుకునేలా అధికారులు ముందస్తు కార్యాచరణ రూపొందించారని చెప్పారు.
ఈ ఉచిత ప్రయాణ సదుపాయం జూన్ 21న తొలి బస్సు సర్వీసు నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు అమల్లో ఉంటుందని వెల్లడించారు. ప్రయాణ సమయంలో ఏవైనా సమస్యలు ఎదురైతే TGSRTC Call Centre నంబర్లు 040-2345 0033 మరియు 6815 3333లను సంప్రదించాలని సూచించారు.
పరీక్షార్థులు చివరి నిమిషంలో హడావుడి పడకుండా ముందుగానే తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని, పరీక్షా కేంద్రాలకు సమయానికి చేరుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని Y. Nagi Reddy సూచించారు. ఈ సందర్భంగా NEET రీ-ఎగ్జామ్‌కు హాజరవుతున్న విద్యార్థులందరికీ TGSRTC తరఫున ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.
