Cyberabad: జగద్గిరిగుట్టలో సంచలనం సృష్టించిన నకిలీ పోలీసుల గ్యాంగ్‌ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. కిడ్నాప్, పోలీసుల వేషధారణ, బెదిరింపులు, అక్రమ నిర్బంధం, డబ్బుల దోపిడీ వంటి కేసుల్లో పాల్గొన్న ఐదుగురు నిందితులను జగద్గిరిగుట్ట పోలీసులు, కూకట్‌పల్లి సీసీఎస్ బృందం సంయుక్తంగా అదుపులోకి తీసుకుంది. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉండగా, వారి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి.
ఈ ఘటన మే 18న జగద్గిరిగుట్ట శోభోదయ కాలనీ సమీపంలో చోటుచేసుకుంది. కూకట్‌పల్లికి చెందిన కావూరి పూర్ణచంద్రరావు అనే వ్యక్తి తన బైక్‌పై ప్రశాంత్‌నగర్ వైపు వెళ్తుండగా, ఓ కారు అతడిని అడ్డగించింది. కారులో నుంచి దిగిన ముగ్గురు వ్యక్తులు తాము పోలీసులమని చెప్పి, హర్యానాలో మీపై క్రిమినల్ కేసు నమోదైందని విచారణకు రావాలని తెలిపారు.
వారిని నిజమైన పోలీసులని నమ్మిన బాధితుడిని బలవంతంగా కారులోకి ఎక్కించి నిర్బంధించారు. అనంతరం అతని మొబైల్ ఫోన్, ఏటీఎం కార్డు, నగదు స్వాధీనం చేసుకుని బ్యాంకింగ్ పాస్‌వర్డ్లు చెప్పించాలని ఒత్తిడి చేశారు. నమ్మకం కలిగించేందుకు హర్యానా పోలీస్ అధికారిగా నటిస్తూ వీడియో కాల్ కూడా ఏర్పాటు చేశారు.
బాధితుడిని సూర్యాపేటకు తీసుకెళ్లిన నిందితులు ఏటీఎం ద్వారా రూ.1 లక్ష నగదు డ్రా చేయించగా, మరో రూ.1 లక్ష ఫోన్‌పే ద్వారా ట్రాన్స్‌ఫర్ చేయించారు. ఆన్‌లైన్ బ్యాంకింగ్ యాప్‌ల ద్వారా మరిన్ని మొత్తాలు బదిలీ చేసి మొత్తం రూ.5.26 లక్షలు దోచుకున్నారు. అనంతరం బాధితుడిపై దాడి చేసి, అతని సిమ్ కార్డు తీసేసి, ఓ సాధారణ మొబైల్ ఇచ్చి నిర్మానుష్య ప్రాంతంలో వదిలేసి పరారయ్యారు.
సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రధాన నిందితుడు నాగరాజు రఘువర్మ అలియాస్ కర్తికేయతో పాటు యశ్వంత్ సింగ్, సత్యభాన్ సింగ్, నాగేంద్ర వర్మలను అరెస్ట్ చేశారు. ప్రదీప్ కుమార్ మిశ్రా, సునీల్ కుమార్ అలియాస్ ఫౌజీ పరారీలో ఉన్నారు.
నిందితుల నుంచి మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఎయిర్ పిస్టల్, దేశీయ తుపాకీ, నకిలీ పోలీస్ యూనిఫాంలు, ఐడీ కార్డులు, హ్యాండ్‌కఫ్స్, పోలీస్ స్టాంపులు, నకిలీ ప్రభుత్వ పత్రాలు, ఫేక్ నంబర్ ప్లేట్లు, సిమ్ కార్డులు, టాటా టియాగో కారు, రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బైకులు స్వాధీనం చేసుకున్నారు.
ప్రధాన నిందితుడు గతంలో సైబరాబాద్, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్ ప్రాంతాల్లో 12 కేసుల్లో పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. జైలులో పరిచయమైన ఈ నిందితులు బయటకు వచ్చిన తర్వాత సంఘటిత నేర ముఠాగా మారినట్లు విచారణలో వెల్లడైంది.
ఈ కేసు దర్యాప్తును డీసీపీ క్రైమ్స్ ముత్యం రెడ్డి, అదనపు డీసీపీ పురుషోత్తం పర్యవేక్షించగా, ఏసీపీ బాలగంగి రెడ్డి, ఏసీపీ నాగేశ్వరరావు, జగద్గిరిగుట్ట ఇన్‌స్పెక్టర్ పి.నరేంద్రరెడ్డి, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ కె.రవికుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు పనిచేశాయి.
