
సోషల్ మీడియాలో వైరల్ వీడియోలతో పోలీసులకు చిక్కిన స్టంట్ బ్యాచ్
హైదరాబాద్ నగర రోడ్లపై ప్రమాదకరంగా బైక్ స్టంట్లు చేస్తూ ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన ఆరుగురు యువకులను రాజేంద్రనగర్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రెండు స్కూటర్లను స్వాధీనం చేసుకున్నారు. రాత్రి వేళల్లో ప్రధాన రహదారులపై నిర్లక్ష్యంగా స్టంట్లు చేస్తూ, వాటి వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
పోలీసుల వివరాల ప్రకారం అరెస్ట్ అయిన వారిలో సయ్యద్ షాహెద్ (19), షేక్ నసీర్ హుస్సేన్ (19), షేక్ జునైద్ (18), మహమ్మద్ బిన్ ఈసా (18), అబ్దుల్ సమద్ (20), మహమ్మద్ అర్బాజ్ హుస్సేన్ ఖాన్ (22) ఉన్నారు. వీరంతా రాత్రి సమయాల్లో నగరంలోని ప్రధాన రహదారులపై స్కూటర్లతో వీలీలు, జిగ్‌జాగ్ డ్రైవింగ్, హ్యాండ్స్ ఫ్రీ రైడింగ్ వంటి ప్రమాదకర స్టంట్లు చేస్తూ ఇతర వాహనదారులను భయభ్రాంతులకు గురిచేసేవారని పోలీసులు తెలిపారు.
ఈ స్టంట్ల వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజేంద్రనగర్ టాస్క్ ఫోర్స్ ప్రత్యేక దృష్టి సారించింది. సీసీ కెమెరా ఫుటేజీలు, సోషల్ మీడియా అకౌంట్ల ఆధారంగా యువకులను గుర్తించి పట్టుకున్నారు. వారి చర్యల వల్ల రోడ్లపై ప్రయాణించే వాహనదారులు, పాదచారుల ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని పోలీసులు పేర్కొన్నారు.
నిందితులపై రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సోషల్ మీడియా ఫేమ్ కోసం యువత ప్రమాదకర స్టంట్లకు పాల్పడడం ఆందోళనకరమని అధికారులు తెలిపారు. రోడ్లపై స్టంట్లు చేయడం చట్టవిరుద్ధమేకాక, ప్రాణాంతక ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని హెచ్చరించారు.
ప్రజల భద్రతకు భంగం కలిగించేలా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ప్రవర్తనపై నిఘా ఉంచాలని, సోషల్ మీడియా ప్రభావంతో ప్రమాదకర చేష్టలకు దూరంగా ఉండేలా అవగాహన కల్పించాలని సూచించారు.
