జూన్ 13న హైదరాబాద్‌లో ‘ఓజీ టూర్’ సందడి
సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ప్రతిష్టాత్మక మ్యూజికల్ ఈవెంట్ ‘ఓజీ టూర్ ఇండియా’ జూన్ 13న హైదరాబాద్‌లోని బౌల్డర్ హిల్స్‌లో గ్రాండ్‌గా జరగనుంది. సంగీత ప్రియులకు మరపురాని అనుభూతిని అందించేందుకు సిద్ధమైన ఈ మెగా కాన్సర్ట్‌లో సంగీతం, డ్యాన్స్, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, ఫైర్‌వర్క్స్‌తో కూడిన గ్రాండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ప్రేక్షకులు ఆస్వాదించబోతున్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో తమన్ మాట్లాడుతూ, ‘ఓజీ’ చిత్ర సంగీతానికి ప్రేక్షకుల నుంచి వచ్చిన అద్భుతమైన స్పందనను సెలబ్రేట్ చేసుకునే ప్రయత్నంగానే ‘ఓజీ టూర్ ఇండియా’ రూపుదిద్దుకుందని తెలిపారు. హైదరాబాద్‌లో తొలిసారిగా ఈ ఈవెంట్ నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన అన్నారు.
“ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘ఓజీ’ మ్యూజిక్ వినిపిస్తోంది. ఆ ఎనర్జీని, ఆ ప్రేమను ప్రేక్షకులతో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ టూర్‌ను ప్లాన్ చేశాం. వర్ష సూచనల కారణంగా జూన్ 6న జరగాల్సిన కార్యక్రమాన్ని జూన్ 13కు వాయిదా వేసాం. ఇప్పుడు మరింత భారీ స్థాయిలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం” అని తమన్ వెల్లడించారు.
ప్రేక్షకుల భద్రత, సౌకర్యాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని, పోలీసు అధికారులు మరియు సంబంధిత విభాగాలతో సమన్వయం చేసుకుంటూ అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నామని ఆయన తెలిపారు. “మాకు ప్రేక్షకులే దేవుళ్లు. వారి భద్రతే మా తొలి ప్రాధాన్యత” అని అన్నారు.
హైదరాబాద్‌తో ప్రారంభమయ్యే ‘ఓజీ టూర్ ఇండియా’లో భాగంగా జూలై 11న బెంగళూరు, ఆగస్టు 15న చెన్నై, సెప్టెంబర్ 25న విశాఖపట్నంలో కూడా కాన్సర్ట్‌లు నిర్వహించనున్నట్లు తమన్ వెల్లడించారు.
ఈ షోలో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో తాను అందించిన సూపర్ హిట్ పాటలను ప్రత్యేకంగా ఎంపిక చేసి ప్రదర్శించనున్నట్లు తెలిపారు. స్టార్ హీరోల బ్లాక్‌బస్టర్ పాటలతో పాటు అద్భుతమైన కొరియోగ్రఫీ, భారీ ఎల్‌ఈడీ స్క్రీన్స్, 3డీ విజువల్ ఎఫెక్ట్స్, ఫైర్‌వర్క్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనున్నాయని చెప్పారు.
“ఈ కాన్సర్ట్ పూర్తిగా మ్యాజికల్ అనుభూతిని అందిస్తుంది. మా ప్లేలిస్ట్ చూసినా మాకే ఎనర్జీ వస్తోంది. గత కొన్ని రోజులుగా నేను కూడా డాన్స్ రిహార్సల్స్ చేస్తున్నాను. ప్రేక్షకులకు పూర్తి స్థాయి లైవ్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌లు అందించబోతున్నాం” అని తమన్ పేర్కొన్నారు.
తాను చేసే ప్రతి లైవ్ షో ద్వారా వచ్చే రెమ్యునరేషన్‌ను సామాజిక సేవా కార్యక్రమాలకు అందిస్తానని, ఈ షోకు సంబంధించిన చారిటీ వివరాలను కార్యక్రమం అనంతరం వెల్లడిస్తానని చెప్పారు.
ఇక ప్రస్తుతం తాను సంగీతం అందిస్తున్న NBK111, Mega158, ఆదర్శ కుటుంబం, లెనిన్, ఇట్లు అర్జున్ చిత్రాలు అద్భుతంగా రూపొందుతున్నాయని, అవన్నీ ప్రేక్షకులను మెప్పించే బ్లాక్‌బస్టర్ చిత్రాలుగా నిలుస్తాయని తమన్ విశ్వాసం వ్యక్తం చేశారు.
ఏసీటీసీ నిర్వాహకుడు సరవణన్ వాసు మాట్లాడుతూ, “తమన్ గారితో కలిసి ఈ టూర్ నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉంది. నేటి యువత ఆయన సంగీతంతో కనెక్ట్ అవుతోంది. ‘ఓజీ టూర్ ఇండియా’ ప్రేక్షకులకు అత్యున్నత స్థాయి మ్యూజికల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించబోతోంది” అని అన్నారు.
భారీ అంచనాల మధ్య జూన్ 13న జరగనున్న ‘ఓజీ టూర్ ఇండియా’ హైదరాబాద్ సంగీత ప్రేమికులకు ఒక మరపురాని మ్యూజికల్ వేడుకగా నిలవనుంది.
