హైదరాబాద్: ఆధునిక యుద్ధ విధానాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో కొత్త సాంకేతికతలు, వ్యూహాలకు అనుగుణంగా తమను తాము తీర్చిదిద్దుకోవాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భారత వైమానిక దళం (ఐఏఎఫ్)లో కొత్తగా కమిషన్ పొందిన అధికారులకు సూచించారు. శత్రువు ఇప్పుడు కేవలం సరిహద్దుల్లో కనిపించే సైనికుడు మాత్రమే కాదని, రాడార్లు, ఉపగ్రహాలు, డ్రోన్లు, రోబోటిక్స్ వంటి ఆధునిక వ్యవస్థల రూపంలో సవాళ్లు ఎదురవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
శనివారం డుండిగల్‌లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో నిర్వహించిన 217వ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ (సీజీపీ)ను సమీక్షించిన రాజ్‌నాథ్,

అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి పరిస్థితులకు అనుగుణంగా తమ ప్రతిస్పందనలను మార్చుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. కేవలం కష్టపడి పనిచేయడమే కాకుండా తెలివిగా పనిచేసి ప్రతిభను కనబరచాలని ఆయన అన్నారు.
“గతంలో శక్తివంతమైన దేశాలకే యుద్ధాల్లో పైచేయి ఉండేది. ఇప్పుడు చిన్న దేశాలు కూడా ఆధునిక ఆయుధాలు, వినూత్న వ్యూహాలతో నిర్ణయాత్మక ఆధిక్యం సాధిస్తున్నాయి. ప్రపంచంలో జరుగుతున్న ప్రతి యుద్ధం మనకు ఒక పాఠశాల వంటిదే” అని రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు.
ఈ పరేడ్ ప్రత్యేకత ఏమిటంటే, పుణెలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ) నుంచి పట్టభద్రులైన తొలి మహిళా క్యాడెట్ల బృందం ఐఏఎఫ్‌లో అధికారికంగా కమిషన్ పొందడం. మే 30న ఎన్‌డీఏలో శిక్షణ పూర్తిచేసుకున్న ఈ మహిళా క్యాడెట్లు, ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శాఖాపరమైన శిక్షణ అనంతరం విధుల్లోకి అడుగుపెట్టారు.
ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ ఉత్తీర్ణులైన శిక్షణార్థులకు ‘ప్రెసిడెంట్ కమిషన్’ను ప్రదానం చేశారు. అలాగే ఐఏఎఫ్, భారత నౌకాదళం, భారత తీర రక్షక దళం మరియు వియత్నాం అధికారులకు ‘వింగ్స్’ మరియు ‘బ్రెవెట్స్’ అందజేశారు.
ఫ్లయింగ్ బ్రాంచ్‌లో ప్రతిభ కనబరిచి ఆర్డర్ ఆఫ్ మెరిట్‌లో తొలి స్థానం సాధించిన ఫ్లయింగ్ ఆఫీసర్ ఆశిష్ కుమార్ యాదవ్‌కు ‘ప్రెసిడెంట్ ప్లాక్’తో పాటు ప్రతిష్ఠాత్మక ‘స్వోర్డ్ ఆఫ్ ఆనర్’ను అందజేశారు. గ్రౌండ్ డ్యూటీ విభాగంలో దివ్యాంశి సింగ్, నావిగేషన్ బ్రాంచ్‌లో ఏక్తా గుప్తా ప్రథమ స్థానాలు సాధించి ‘ప్రెసిడెంట్ ప్లాక్’లను అందుకున్నారు.
కార్యక్రమానికి ముందు ఆకాశ్ గంగా స్కైడైవింగ్ బృందం, ఎయిర్ వారియర్ డ్రిల్ టీమ్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అనంతరం ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ నేతృత్వంలో ఫ్లైపాస్ట్ నిర్వహించారు. పిలాటస్ పీసీ-7 ఎంకే-II, హాక్, కిరణ్, చేతక్ శిక్షణ విమానాలు ఫ్లైపాస్ట్‌లో పాల్గొన్నాయి. సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానం, సారంగ్ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్, సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్ ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
