హైదరాబాద్, జూన్ 15: వర్షాకాలంలో అధికారులు పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలని, ప్రజలకు ఇబ్బందులు కలిగించే నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోనని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వర్షాల కారణంగా ట్రాఫిక్ జామ్‌లు, వాటర్‌లాగింగ్ వంటి సమస్యలు తలెత్తితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే తాను కూడా రోడ్లపైకి వచ్చి పరిస్థితిని సమీక్షిస్తానని తెలిపారు.
వర్షాకాల సన్నద్ధతపై MCRHRD ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జూన్ 9న హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాల వల్ల ఏర్పడిన పరిస్థితులపై ఆరా తీశారు. ముఖ్యంగా సైబరాబాద్ సహా పలు ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ జామ్‌లతో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ మున్సిపల్, పోలీసు, ట్రాఫిక్ శాఖల అధికారులు తగిన స్థాయిలో స్పందించలేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. వర్షాల సన్నద్ధతపై జూన్ 1న నిర్వహించిన సమీక్షలో ఇచ్చిన సూచనలను అధికారులు అమలు చేయలేదని మండిపడ్డారు. మున్సిపల్, పోలీసు శాఖల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపించిందని పేర్కొన్నారు.
ఈ ఘటనలకు కారణమైన అంశాలను సమగ్రంగా విశ్లేషించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, డీజీపీ సీవీ ఆనంద్‌లను ఆదేశించారు. మరోసారి ఇలాంటి పరిస్థితులు పునరావృతమైతే మరింత కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
వర్షాల సమయంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, హైడ్రా, ట్రాఫిక్, జలమండలి, విద్యుత్ శాఖలతో పాటు సివిల్ పోలీసులు కూడా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారు. పోలీసు కమిషనర్ల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు రోడ్లపై విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు. ట్రాఫిక్ విభాగంలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డీజీపీకి సూచించారు.
వాటర్‌లాగింగ్ పాయింట్లు, బ్లాక్ స్పాట్లు, ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా తలెత్తే ప్రాంతాలపై ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని అధికారులకు సూచించారు. మానవ తప్పిదాల వల్ల సమస్యలు తలెత్తితే వాటిని సహించబోనని హెచ్చరించారు.
వర్షాల కారణంగా చెట్లు కూలి విద్యుత్ సరఫరా నిలిచిపోవడం పట్ల కూడా ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట్ల మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్లు అందుబాటులో ఉంచాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.
ఇరిగేషన్ శాఖ అధికారులకు రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచించిన సీఎం, ప్రాజెక్టుల నిర్వహణ మాన్యువల్ ప్రకారమే జరగాలని చెప్పారు. వర్షాకాలంలో ఇంజినీర్లు ప్రాజెక్టుల వద్దే అందుబాటులో ఉండాలని, అనుమతి లేకుండా విధులు వదిలి వెళ్లిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వ్యవసాయ శాఖ అధికారులు విత్తనాలు, యూరియా సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. రైతు వేదికల ద్వారా యూరియా పంపిణీ చేయాలని, స్థానిక వ్యవసాయ అధికారులు, రెవెన్యూ సిబ్బంది సమన్వయంతో పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించాలని తెలిపారు. సన్న వడ్ల సాగుకు ప్రభుత్వం సూచించిన విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.
తాగునీటి కాలుష్యాన్ని నివారించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని జలమండలి అధికారులను సీఎం ఆదేశించారు. నీటి నాణ్యతపై తరచూ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకుని వైద్య ఆరోగ్య శాఖ అవసరమైన మందులు, వైద్య సదుపాయాలతో సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. వర్షాల సమయంలో పారిశుద్ధ్య చర్యలను మరింత ముమ్మరం చేయాలని కూడా ఆదేశించారు.
వర్షాకాలంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Won’t Tolerate Traffic Jams , Says Revanth Reddy

