హైదరాబాద్: నగరంలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు. కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలోని వివిధ శాఖలు, ఏజెన్సీల ఉన్నతాధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పోలీస్, ట్రాఫిక్ పోలీస్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, హైడ్రా (HYDRAA), విద్యుత్ పంపిణీ సంస్థలు, వాటర్ బోర్డు సహా సంబంధిత శాఖలన్నీ పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు. నగరంలో అత్యవసర సేవలు నిరంతరాయంగా కొనసాగడంతో పాటు సాధారణ పౌర జీవనం దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
వర్షాల కారణంగా నీరు నిలిచే ప్రాంతాలను ముందుగానే గుర్తించి, అక్కడ ప్రత్యేక బృందాలను మోహరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని పేర్కొన్నారు.
వర్షాల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు ముఖ్యమంత్రి అత్యవసరంగా ‘వార్ రూమ్’ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ముఖ్య కార్యదర్శి, డీజీపీ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (CURE)తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొని నగరంలోని పరిస్థితులను ప్రత్యక్షంగా పర్యవేక్షించనున్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
CM Revanth Reddy Directs Officials to Stay on High Alert as Heavy Rains Lash Hyderabad
