హైదరాబాద్: తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం (GUN PARK ) వద్ద భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ శుక్రవారం భారీ నిరసన చేపట్టింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ Harish Rao, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ‘ఆరు గ్యారంటీలు’ అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ, బీఆర్ఎస్ నేతలు ప్లకార్డులు, “బాకీ కార్డులు” ప్రదర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు.
ఈ సందర్భంగా KTR మాట్లాడుతూ, “అభయహస్తం మేనిఫెస్టో ద్వారా ప్రజలను నమ్మబలికి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, 100 రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పింది. కానీ మూడో బడ్జెట్ ప్రవేశపెట్టినా కూడా ఆ హామీలకు చట్టబద్ధత ఇవ్వకుండా, సరైన నిధులు కేటాయించకుండా ప్రజలను వంచిస్తోంది” అని అన్నారు.
వృద్ధులు, వితంతువులకు నెలకు రూ.4,000 పెన్షన్, దివ్యాంగులకు రూ.6,000 పెన్షన్ ఇప్పటివరకు అమలు కాలేదని ప్రశ్నించారు. మహిళలకు నెలకు రూ.2,500 చొప్పున అందించాల్సిన మహాలక్ష్మి పథకం ఏమైందని నిలదీశారు.
రైతులకు రైతు భరోసా కింద పెంచిన ఆర్థిక సహాయం విడుదల కాలేదని, నిరుద్యోగులకు హామీ ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాలు ఇప్పటికీ పూర్తి కాలేదని విమర్శించారు. ఆటో డ్రైవర్లకు రూ.24,000 సాయం, పేదింటి ఆడబిడ్డలకు తులం బంగారం వంటి హామీలు కూడా అమలు కాలేదని పేర్కొన్నారు.
ప్రభుత్వం దివ్యాంగులు, వృద్ధులు తదితర వర్గాలకు రూ.54,000 వరకు బాకీలు ఉన్నాయని ఆరోపిస్తూ, వివిధ వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు.
“బాండ్ పేపర్లపై హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఇప్పటికీ వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోంది. అసెంబ్లీ, మండలి సమావేశాల్లో ప్రతి అంశాన్ని లేవనెత్తి ప్రభుత్వాన్ని నిలదీస్తాం” అని కేటీఆర్ హెచ్చరించారు.
