హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని తీవ్రమైన ఎండలు, వడగాల్పులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా హీట్‌వేవ్ పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చనున్న నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అత్యవసర సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, వైద్యాధికారులు, విపత్తు నిర్వహణ శాఖలను అప్రమత్తం చేశారు. ప్రజల ప్రాణ రక్షణే ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని మంత్రి స్పష్టం చేశారు.
వడగాల్పుల కారణంగా ఇప్పటివరకు రాష్ట్రంలోని 7 జిల్లాల్లో 16 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం వెల్లడించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేయనున్నట్లు ప్రకటించింది. బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
భారత వాతావరణ శాఖ (IMD) రాష్ట్రంలోని పలు జిల్లాలకు హీట్‌వేవ్ హెచ్చరికలు జారీ చేసింది. ఖమ్మం, వరంగల్, హనుమకొండ, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట తదితర జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 నుంచి 47 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ సహా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో కూడా వేడి గాలులు తీవ్రంగా వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.
హైదరాబాద్ నగరంలో రానున్న మూడు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 నుంచి 41 డిగ్రీల మధ్య ఉండనున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ రోజు నగరంలో ఉష్ణోగ్రత 40 డిగ్రీల వరకు నమోదు కాగా, రేపు 41 డిగ్రీలు, ఎల్లుండి కూడా 41 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది. కొన్నిచోట్ల సాయంత్రం ఉరుములు, ఈదురుగాలులతో తేలికపాటి వర్షాలు పడే అవకాశమున్నప్పటికీ వేడి తీవ్రత మాత్రం తగ్గదని అధికారులు చెబుతున్నారు.
ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని ప్రభుత్వం ప్రజలకు సూచించింది. వృద్ధులు, గర్భిణీలు, చిన్నారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. వ్యవసాయ కార్మికులు, నిర్మాణ కార్మికులకు పని వేళల్లో మార్పులు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎండదెబ్బ కేసులకు ప్రత్యేక వార్డులు సిద్ధం చేయాలని వైద్య ఆరోగ్య శాఖకు సూచించారు. గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు గంట గంటకు హెచ్చరికలు అందించాలని కలెక్టర్లకు మంత్రి పొంగులేటి ఆదేశాలు ఇచ్చారు. తాగునీటి కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని, గ్రామాలు, పట్టణాల్లో చల్లని నీటి కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
