
గ్రామాలకు స్ఫూర్తినిచ్చే సినిమా ‘పెద్ది’: రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా ‘పెద్ది’పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు బుచ్చి బాబు సానా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, రెండు చార్ట్‌బస్టర్ పాటలు, పవర్‌ఫుల్ థియేట్రికల్ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రత్యేక ప్రీమియర్ షోలు జూన్ 3న ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా చిత్రబృందం ఢిల్లీలో ఘనంగా ప్రెస్ మీట్ నిర్వహించింది.
ప్రెస్ మీట్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ, “ఈ సినిమా కోసం మేమంతా గత రెండున్నర సంవత్సరాలుగా ఎంతో నిజాయితీగా, అంకితభావంతో పనిచేశాం. దర్శకుడు బుచ్చిబాబు గారు, నిర్మాత సతీష్ గారు, లెజెండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ గారు, బోమన్ ఇరానీ గారు, దివ్యేందు తదితర అద్భుతమైన టీమ్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. ఇది కేవలం ఒక ఎంటర్‌టైనర్ మాత్రమే కాదు, ప్రేక్షకులను ఆలోచింపజేసే, స్ఫూర్తినిచ్చే సినిమా” అని అన్నారు.
‘పెద్ది’ కథ గురించి మాట్లాడుతూ రామ్ చరణ్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. “ఇటీవల ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ గారిని కలిసినప్పుడు ‘పెద్ది’ కథ ఏమిటని అడిగారు. గ్రామాలకు సాధికారతను అందించే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమా అని చెప్పాను. అప్పుడు ఆయన వెస్ట్ బెంగాల్‌లో ప్రచారం సందర్భంగా కలిసిన యువకుల గురించి ఒక ఆసక్తికరమైన సంఘటన చెప్పారు. దాదాపు 40 ఏళ్ల క్రితం వారి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి భారత ఫుట్‌బాల్ జట్టుకు ఆడగా, ఇప్పుడు అదే గ్రామంలో 80 శాతం మంది యువకులు ఫుట్‌బాల్ ఆడుతున్నారని చెప్పారు. ఒక వ్యక్తి స్ఫూర్తి ఎంత పెద్ద మార్పు తీసుకురాగలదో ఆ ఉదాహరణ చూపిస్తుంది. ‘పెద్ది’ కూడా అలాంటి కథే. ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన యువకుడు తన గుర్తింపు కోసం చేసే పోరాటం ఈ చిత్రంలో ఉంటుంది” అని తెలిపారు.
ఇంకా మాట్లాడుతూ, “ఇది మట్టి వాసన ఉన్న కథ. నేను గతంలో చేసిన రూరల్ బ్యాక్‌డ్రాప్ సినిమాలు ప్రేక్షకుల ఆదరణ పొందాయి. భారతదేశంలోని అత్యుత్తమ క్రీడాకారుల్లో చాలామంది గ్రామీణ, గిరిజన ప్రాంతాల నుంచే వచ్చారు. అలాంటి స్ఫూర్తిదాయకమైన అంశాలను ఈ సినిమాలో చూపించాం. పిల్లలతో కలిసి థియేటర్లలో ఈ సినిమాను చూడండి. వారికి ఇది గొప్ప ప్రేరణగా నిలుస్తుంది. ‘పెద్ది’ ఒక లార్జ్ స్కేల్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్. జూన్ 4న థియేటర్లలో చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
హీరోయిన్ జాన్వి కపూర్ మాట్లాడుతూ, “ఈ సినిమాలో నాకు చాలా ప్రత్యేకమైన పాత్ర దక్కింది. బుచ్చిబాబు గారు ఆ పాత్రను ఎంతో అందంగా తీర్చిదిద్దారు. నేను పూర్తిగా ఆయన విజన్‌ను అనుసరించాను. రామ్ చరణ్ గారితో పనిచేయడం అద్భుతమైన అనుభవం. ఆయన ఎనర్జీ, కమిట్‌మెంట్ నాకు ఎంతో నేర్పాయి. ఇది భారతీయుల కోసం, భారతీయ భావోద్వేగాలతో రూపొందించిన రూటెడ్ ఫిల్మ్. జూన్ 4న కుటుంబ సభ్యులతో కలిసి తప్పకుండా ఈ సినిమాను చూడండి” అని కోరారు.
సీనియర్ నటుడు బోమన్ ఇరానీ మాట్లాడుతూ, “రామ్ చరణ్ ఒక అసాధారణ నటుడు. ఆయన డాన్స్, ఎనర్జీ, ప్రేక్షకులను అలరించే తపన అద్భుతంగా ఉంటాయి. బుచ్చిబాబు గారు కథ చెప్పిన వెంటనే ఈ సినిమాలో భాగం కావాలని నిర్ణయించుకున్నాను. ఈ చిత్రంలో పనిచేయడం గొప్ప అనుభవం. అద్భుతమైన లొకేషన్లలో షూట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తుంది” అన్నారు.
నటుడు దివ్యేందు శర్మ మాట్లాడుతూ, “ఇది నా తొలి తెలుగు చిత్రం. ఇలాంటి ప్రతిష్టాత్మక చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగా ఉంది. రామ్ చరణ్ గారితో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. రత్నవేలు గారి విజువల్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ‘పెద్ది’లో రామ్ చరణ్ గారి పాత్ర, తన గుర్తింపు కోసం చేసే పోరాటం ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది” అన్నారు.
నిర్మాత వెంకట సతీష్ కిలారు మాట్లాడుతూ, “ఈ చిత్రాన్ని నిర్మించడం గర్వంగా భావిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఎంతో అంకితభావంతో పనిచేశారు. ఇది ఎమోషన్, ఎంటర్‌టైన్‌మెంట్, గ్రాండియర్ కలిసిన రూటెడ్ స్టోరీ. ప్రేక్షకులు కుటుంబ సమేతంగా థియేటర్లలో ఈ సినిమాను ఆస్వాదించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
భారీ అంచనాల నడుమ విడుదలకు సిద్ధమవుతున్న ‘పెద్ది’ ప్రేక్షకులకు వినోదంతో పాటు స్ఫూర్తిని అందించే ఒక గొప్ప సినిమాగా నిలుస్తుందనే నమ్మకాన్ని చిత్రబృందం వ్యక్తం చేసింది.
